గతేడాది మార్చి 9న పురపాలిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే నెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 14న వాటిని పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 23వ తేదీన పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాలేదు. అయితే కరోనా కారణంగా అదే నెల 15న ఎన్నికలను వాయిదా వేశారు.
2,535 నామినేషన్లు
జిల్లాలోని అనంత నగరపాలక సంస్థలోని 50 డివిజన్లతోపాటు హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి పురపాలికలు, పుట్టపర్తి, మడకశిర నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో 308 వార్డులు ఉన్నాయి. గతంలోనే 2,535 నామినేషన్లు దాఖలయ్యాయి. అప్పట్లోనే పరిశీలించిన అధికారులు వివిధ కారణాలతో 255 నామపత్రాలను తిరస్కరించారు. 2,280 మందిని అర్హులుగా గుర్తించి జాబితా ప్రకటించారు. తాజాగా ఉపసంహరణ ముగిసే సరికి తుది బరిలో ఎంతమంది నిలుస్తారనేది వేచి చూడాలి.
రిజర్వేషన్లు ఇలా..
ఒక నగరపాలికతోపాటు 8 పురపాలికలు, 2 నగర పంచాయతీలకు గతంలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. అనంత నగరపాలక సంస్థలోని 50 డివిజన్లకు సంబంధించి మహిళలకు 25 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు 3 (మహిళలు-1, జనరల్-2), ఎస్టీలకు 1 (జనరల్), బీసీలకు 17 (మహిళలు-08, జనరల్-09), జనరల్ మహిళలకు ప్రత్యేకంగా 16, అన్‌రిజర్వుడ్‌కు 13 స్థానాలు కేటాయించారు. మిగిలిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 308 వార్డులకు గాను 153 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 33 (మహిళలు-15, జనరల్-18), ఎస్టీలకు 10 (జనరల్), బీసీలకు 99 (మహిళలు-47, జనరల్-52), జనరల్ మహిళకు 91, అన్‌రిజర్వుడ్‌కు 75 స్థానాలు కేటాయించారు.
పామిడి, పెనుకొండకు ఎన్నికలు లేనట్టే
2012 జనవరిలో పామిడి మేజర్ పంచాయతీని గ్రేడ్-4 నగర పంచాయతీగా ఉన్నతీకరించారు. 2014లో పురపాలిక ఎన్నికలు నిర్వహించారు. అయితే వార్డుల్లో వసతులు పెరగకపోగా.. పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామిడిని మళ్లీ మేజర్ పంచాయతీగా మార్పు చేస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి హామీ ఇచ్చారు. దాని ప్రకారమే గతేడాది మార్చిలో వచ్చిన నోటిఫికేషన్‌లో పామిడి ఎన్నికలను నిలుపుదల చేయించారు.
పెనుకొండ మేజర్ పంచాయతీని 2020 జనవరిలో నగర పంచాయతీగా ఉన్నతీకరించారు. అయితే నోటిఫికేషన్ వచ్చే నాటికి పూర్తిగా వార్డుల విభజన కాకపోవడంతో ఆ సమయంలో ఎన్నికలు నిలుపుదల చేశారు.
ఎనిమిది మంది అభ్యర్థుల మృతి
గతేడాది మార్చిలో మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన ఎనిమిది మంది అభ్యర్థులు అనారోగ్య కారణాలతో మృతిచెందారు. పుట్టపర్తి నగర పంచాయతీలోని 7వ వార్డుకు నామినేషన్ వేసిన వైకాపా అభ్యర్థి సూర్యనారాయణరెడ్డి, 10వ వార్డుకు తెదేపా తరపున బరిలో నిలిచిన నాగేంద్రమ్మ మృతిచెందారు. రాయదుర్గం మున్సిపాలిటీలో 26వ వార్డుకు వైకాపా తరఫున బరిలో నిలిచిన అబ్దుల్ రహిమాన్, తాడిపత్రి 10వ వార్డుకు నామినేషన్ వేసిన తెదేపా అభ్యర్థి రజియా, మడకశిర నగర పంచాయతీ 3వ వార్డులో తెదేపా అభ్యర్థి బొమ్మలింగప్ప, కదిరి మున్సిపాలిటీ 2వ వార్డుకు నామినేషన్ వేసిన భాజపా అభ్యర్థి రామకృష్ణ, 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహబూబ్‌బాష, హిందూపురం పట్టణం 15వ వార్డు సీపీఐ అభ్యర్థిని షాహీదా మరణించారు.
ఈ నేపథ్యంలో ఆయా వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక వాయిదా వేస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వీటిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఎక్కడికక్కడ అన్ని మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రత్యేక గదుల్లో నామపత్రాలను భద్రపరిచారు. తాజా ప్రకటన ప్రకారం మార్చి 2 నుంచి నామపత్రాల ఉపసంహరణ ఆరంభమవుతుంది. 10న అన్ని పురపాలికలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అవసరమైనచోట 13న రీపోలింగ్ జరుపుతారు.
మేయర్, ఛైర్మన్లు ఇలా..
అనంత నగరపాలక మేయర్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. మున్సిపల్ ఛైర్మన్‌లకు సంబంధించి ధర్మవరం బీసీ మహిళ, గుంతకల్లు జనరల్ మహిళ, హిందూపురం అన్‌రిజర్వుడ్, కదిరి జనరల్ మహిళ, తాడిపత్రి అన్‌రిజర్వుడ్, రాయదుర్గం బీసీ జనరల్, గుత్తి జనరల్ మహిళ, కళ్యాణదుర్గం బీసీ జనరల్‌కు కేటాయించారు. నగర పంచాయతీలు.. మడకశిరకు ఎస్సీ జనరల్, పుట్టపర్తి అన్‌రిజర్వుడ్‌కు కేటాయించారు.
అన్ని పార్టీల నుంచి నామపత్రాలు
నగర, పుర పాలికల ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లు, 308 వార్డులకు అన్ని ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా అధికార వైకాపా నుంచి 965 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా నుంచి 703, భాజపా తరపున 116, జనసేన 59 నామపత్రాలు దాఖలు చేశారు.