YSRCP Sarpanch death: వైకాపా సర్పంచ్ అయిన తన కుమారుడిని పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తల్లి స్పందన కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. అయితే హత్య కాదని, ఆత్మహత్యేనని ఎస్పీ వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు ఆమె చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎల్లనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన వైకాపా సర్పంచ్ చంద్రశేఖర్ నాయుడు లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. గత నెలలో లారీ ఓనర్‌కు రూ.1,75,000 నగదు ఇవ్వాల్సి ఉండగా.. లారీ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు.. సర్పంచ్ చంద్రశేఖర్ నాయుడును స్టేషన్‌కు పిలిపించారు. డబ్బులు ఇవ్వాల్సిన విషయాన్ని తల్లి రామాంజినమ్మకు చెప్పారు. డబ్బులు కట్టడానికి సిద్ధమైన రామాంజినమ్మకు.. కుమారుడు పోలీస్ స్టేషన్ సమీపంలో కరెంటు పట్టుకొని చనిపోయాడని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
నా కుమారుడు రూ.1,75,000కే చనిపోయేంత పిరికోడు కాదు. 5 ఎకరాల పొలం అమ్మి సర్పంచ్‌గా గెలిచాడు. పోలీసులు, లారీ ఓనర్ కలిసి తన కుమారుడిని చంపి ఉంటారు. కరెంటు పట్టుకొని ఉంటే.. ఒంటిపై గాయాలు ఎందుకు అవుతాయి? పోలీసులు కావాలనే తమకు తప్పుడు సమాచారం ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో వైకాపా సర్పంచ్‌కే న్యాయం లేకపోతే.. ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది. -రామాంజినమ్మ, మృతుడి తల్లి
ముఖ్యమంత్రి జగన్ దీనిపై చొరవ తీసుకొని న్యాయం చేయాలని మృతుడి తల్లి కోరారు. తాడిపత్రి పోలీసులపై తమకు నమ్మకం లేదని.. వేరే ప్రాంత పోలీసులతో దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: