Minister Ushasri Charan Gadapa Gadapaku: అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. కుందుర్పి మండలం కొల్లరహట్టిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఉషశ్రీ బయల్దేరగా.. గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండి.. మంత్రి కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి తన అనుచరులతో కలిసి ద్విచక్రవాహనంపైనే గమ్యస్థానానికి చేరుకున్నారు. మంత్రి బైక్‌పై ప్రయాణించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రోడ్డు బాగాలేదని పలుమార్లు ఆ గ్రామస్థులు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు అదే మార్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ ద్విచక్ర వాహనంపై గడపగడపకూ వెళ్లాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం శీగలపల్లి నుంచి కొల్లరహట్టికి వెళ్లే 1.5 కి.మీ. మట్టి రోడ్డు అధ్వానంగా ఉంది. గత మూడేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. 4 నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు దారి మొత్తం కోతకు గురైంది. కొల్లరహట్టి గ్రామస్థులు కాలినడకన, ద్విచక్ర వాహనాల్లోనే పొలాల మీదుగా వేసుకున్న దారిలో ప్రయాణించాల్సి వస్తోంది. మరమ్మతుల కోసం పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్థులు తెలిపారు.
శనివారం గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఉష శ్రీచరణ్ శీగలపల్లి నుంచి కొల్లరహట్టికి వైకాపా నేత ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ సందర్భంగా రహదారి నిర్మించాలని గ్రామస్థులు ఆమెను కోరారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉందని, త్వరలో నిర్మిస్తామని మంత్రి ఉష శ్రీచరణ్ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర నేతలు ద్విచక్ర వాహనాలపైనే వెళ్లారు.
ఇవీ చదవండి: