అనంతపురంలోని కలెక్టరేట్లో.. జిల్లాస్థాయి కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీతో రోడ్ల భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్‌తో పాటు కొవిడ్ విధుల్లో ఉన్న.. ఉన్నతాధికారులతో జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లపై సూక్ష్మ స్థాయిలో దృష్టి పెట్టి సిబ్బంది సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైద్య నిర్ధరణ పరీక్షలను అనవసరమైన వారికి నిర్వహించరాదన్నారు. 40 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవారిని ప్రోత్సహించరాదన్నారు. 60 ఏళ్ళు పైబడిన వారు, జబ్బులు ఉన్నవారు అందరికీ ప్రాధాన్యత నిచ్చి టెస్టులు చేయాలని మంత్రి సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్లో అధికారులు మరింత చొరవ చూపాలన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని ఆరు అంచెల వ్యవస్థ ద్వారా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లను మరింత పెంచడం, ఎక్కువ ఆసుపత్రులను సిద్ధం చేయడం, హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం, శాంపిల్స్ , టెస్టింగ్ లపై దృష్టి సారించడం, కంటోన్మెంట్ క్లస్టర్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టడం, కరోనా వ్యాధి పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. దీనిపై నోడల్ అధికారులు, జిల్లా అధికారుల పరిధిలో ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు