Minister Peddireddy video conference: అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన దుర్ఘటన మరోసారి పునరావృతం కాకూడదని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన తక్షణమే అధికారులు స్పందించాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్యలపై ప్రజలు 1912 టోల్ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. చిన్న సమస్య అయినా ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించే అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, వాటిని పరిష్కరించాలని సూచించారు. అధికారులు హెడ్ క్వార్టర్స్‌లోనే ఖచ్చితంగా ఉండాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్కరికీ ప్రాణహాని కలిగినా మొత్తం డిపార్ట్మెంట్కు చెడ్డపేరు వస్తుందని, బాధ్యతతో పనిచేయడం ద్వారా ఇటువంటి ఘటనలు జరగకుండా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, క్రమం తప్పకుండా ఈ కమిటీలు అన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తాయని అన్నారు. కిందిస్థాయిలో లైన్ మెన్, విద్యుత్ ఎఇలు క్షేత్ర పర్యటనలు చేయాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే వాటిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుత్ రంగానికి సంబంధించి కర్నూలు, అనంతరపురం జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంత నిర్లక్ష్యానికి గురయ్యాయని, పాత విద్యుత్ లైన్లను సకాలంలో మార్చకపోవడం, ఆధునీకరణ చేపట్టకపోవడం వల్ల లైన్లు తెగిపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. వెంటనే ఈ రెండు జిల్లాల ఎస్ఇ, ఇఇ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లైన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఈ నెలాఖరు నాటికి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్ ను ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డీబీటీ కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు ఖాతాలను ప్రారంభించడం, ఆధార్ అప్ డేట్ చేయడాన్ని మరింత వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: