రాష్ట్రంలో ఒకేరోజు 465 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,961కి పెరిగింది. కట్టడి ప్రాంతాలు 741కి చేరుకున్నాయి. కేసుల విస్తృతితో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో 17,609 నమూనాలు పరీక్షించారు. వీటితో రాష్ట్రంలో స్థానికంగా 376 కేసులు బయటపడ్డాయి. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 19, 70 చొప్పున కేసులను గుర్తించారు. కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి వంతున ప్రాణాలు విడిచారు. వీరితో మృతుల సంఖ్య 96కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలోని 8 మండలాల్లో..
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జూన్ 2న మొదటి కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ గ్రామంలో 29 మందికి వైరస్ సోకింది. వీరిలో 16 మంది ఒకే కాలనీకి చెందినవారు. ధర్మవరంలో ఓ ప్రజాప్రతినిధి అంగరక్షకుడు కరోనాతో ఇటీవల మృతి చెందారు. అతని ద్వారా ఆరుగురికి వైరస్ సోకింది. జిల్లాకు చెందిన మరో ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబంలోనూ వైరస్ కలకలం సృష్టించింది. ఆయన బంధువొకరు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆ కుటుంబంలో ఐదుగురు వైరస్ బారినపడ్డారు. ధర్మవరంలో 34 కేసులు వచ్చాయి. ఆదివారం నుంచి వారం పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
కియాలో పది మందికి కరోనా
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా, దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే పది మంది కార్మికులకు శుక్రవారం కరోనా లక్షణాలు కనిపించాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఒంగోలులోని 14 ప్రాంతాల్లో కేసులు
ప్రకాశం జిల్లాలో ఈ నెల 1కి 88 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనెల 16న 18, 17న 24, 18న 38 చొప్పున కేసులు వచ్చాయి. శుక్రవారం మరో 28 కేసులు రావడంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 296కి చేరింది. ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు వచ్చాయి. చీరాల పరిసరాల్లో 47 కేసులు వచ్చాయి. ఈ నెల 11న చీరాలలోని జయంతిపేటలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చిన దంపతులకు వైరస్ సోకింది. వీరు వెళ్లిన ప్రైవేటు వైద్యశాల ఎండీ, సిబ్బంది, చికిత్సకు వచ్చిన పలువురికీ వైరస్ సోకింది. ఈ ఆసుపత్రి కేంద్రంగా 22 కేసులు బయటపడ్డాయి. వైరస్ వ్యాప్తి వల్ల ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు.
పలాసలోనూ లాక్‌డౌన్
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం ఈ నెల 11న జరిగింది. అక్కడ 200 మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువుకు ఆ తర్వాత వైరస్ సోకినట్లు తేలింది. ఇదే కార్యక్రమానికి హాజరైన ఓ వ్యాపారి (కాశీబుగ్గ)కీ కరోనా వచ్చింది. దీంతో పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. అంతకుముందే మందసలో ఓ వ్యక్తి వైరస్ సోకి మరణించడం, సంస్మరణ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరైనందున నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ ప్రకటించారు.
ఇదీ చదవండి: 'మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు'