JC Prabhakar Reddy Fire On Spandana Program : గత రెండు సంవత్సరాలలో 16 కేజీల అర్జీలను స్పందన కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు ఇచ్చానని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అందులో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వివిధ శాఖలకు ఫిర్యాదులు చేసిన 16 కిలోల ప్రతులను మీడియా ఎదుట తూకం వేసి 750 రూపాయలకు విక్రయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పందన కార్యక్రమంపై, అలాగే ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
అవసరమైతే కాళ్లు పట్టుకుంటా : తాను లేవనెత్తిన సమస్యలు పరిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం అవరసమైతే అధికారుల కాళ్లు పట్టుకుంటానని అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన అర్జీలకే దిక్కులేదన్న ఆయన.. స్పందన శుద్ధ దండగ కార్యక్రమమని విమర్శించారు. అధికారులను అడుగుదామని వెళ్తుంటే నిర్బంధాలతో అడ్డుకుంటున్నారంటూ అధికారులపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రి మున్సిపాలిటీని నాశనం చేసేందుకే స్థానిక అధికారులు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. స్పందన కార్యక్రమం వృథా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
స్పందనలో స్పందించని అధికారులు : ఎన్నో అక్రమాలు జరుగుతున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు ఏ మాత్రం స్పందించని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గతంలో కలెక్టరేట్‌కు స్పందనలో ఫిర్యాదు చేయటానికి వచ్చే ప్రజలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కనీసం తాగునీరు, మధ్యాహ్నం భోజనం ఇచ్చేవారని, ఇపుడు అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అనేక కష్టాలు పడి తమ సమస్యలు చెప్పుకోవటానికి కలెక్టర్ వద్దకు వచ్చి స్పందనలో ఫిర్యాదు చేస్తే అధికారులు ఏ మాత్రం స్పందించటం లేదన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి శాపనార్దాలు : రాష్ట్రంలో 75 మున్సిపాలిటీల్లో తాడిపత్రి మున్సిపాలిటీ ఉత్తమమైనదిగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కారణంగా తాగునీటి సమస్య, చెత్త సమస్య తీవ్రంగా ఉందని విమర్శించారు. రెండు కోట్ల రూపాయల ఆదాయంతో అప్పగించానని, ప్రస్తుతం పారిశుద్ధ్య వాహనాలకు డీజిల్ కూడా పోయలేని పరిస్థితికి తాడిపత్రి మున్సిపాలిటీని తీసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలను అడ్డుకోని అధికారుల తీరును ఎండగట్టారు. ప్రజల సమస్యలు పట్టించుకోని, అక్రమాలను అడ్డుకోని అధికారులంతా నాశనమై పోతారని జేసీ ప్రభాకర్ రెడ్డి శాపనార్దాలు పెట్టారు.
"స్పందనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదు. వాళ్ల ఎమ్మెల్యేనే స్పందన వేస్ట్ అని చెప్తున్నాడు. మా ఊరి ప్రజల కోసం ఏ అధికారి కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా, నేను మాట తప్పను" - జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్
ఇవీ చదవండి