కడప జిల్లా పొద్దుటూరు నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 400 బస్తాల లోడుతో వెళుతున్న లారీని ఆపి తనిఖీ చేయగా రేషన్ బియ్యం పట్టుబడింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి లారీతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ హేమంత్ కుమార్ తెలిపారు.
మరో ఘటనలో...
అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 134 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పరిధిలోని నరసనాయనికుంట గ్రామంలో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన నారాయణ నాయక్ అతని ఇద్దరు కుమారులు బియ్యాన్ని తరలించడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి:
AMARAVATI: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ.. రాజీనామా చేయాలని రైతుల డిమాండ్