అనంతపురంలో మద్యం అమ్మకాలపై మూడో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలో కర్ణాటక మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 231 టెట్రా ప్యాకెట్ల మద్యం సహా ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సరే.. చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
విశాఖ ఏజెన్సీలో 180 కిలోల భారీ గంజాయి..
విశాఖ ఏజన్సీ నుంచి గంజాయిని కారులో తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు అరెస్టు చేశారు. కరోనా లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో రాజుపాలెం క్రాస్ రోడ్డులో ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎస్ఐ చౌడయ్య వాహనాలను తనిఖీలు చేశారు. చిలకలూరిపేట వైపు నుంచి వచ్చిన కారులో సుమారు 180 కిలోల భారీ సరుకును గుర్తించారు. 90 పొట్లాల్లో ప్యాక్ చేసిన గంజాయి సహా రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందని సీఐ అల్తాఫ్ హుస్సేన్ అంచనా వేశారు. జిల్లాకు చెందిన కొండ్రపు నాయుడు, చిన్నదేవర ఆసై, బోడకుర్తి రాజేష్, మంచిమిశెట్టి రామకృష్ణ, నెల్లూరు జిల్లా తడకు చెందిన ఆవుల మనోహర్‌లను అరెస్ట్ చేశామని తెలిపారు.
రూ.5 లక్షల గంజాయి సీజ్..
విశాఖ జిల్లా మాడుగులలో భారీగా గంజాయి పట్టుబడింది. మాడుగుల మండల పరిధిలోని ఎం.కోటపాడు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బొలెరో వాహనంలో గంజాయిని గుర్తించినట్లు ఎస్సై రామారావు తెలిపారు. ఈ క్రమంలో రూ.5 లక్షల విలువైన 50 కేజీల గంజాయితో పాటు వాహనాన్ని సైతం సీజ్ చేశామన్నారు. హుకుంపేట మండలం బాకూరు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రామారావు పేర్కొన్నారు.
తిరుపతిలో కర్ణాటక మద్యం..
తిరుపతిలోని పెద్ద కాపు లే అవుట్లో సుమారు రూ.9 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, కర్ణాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు ఆదేశాల మేరకు మద్యం, మాదక ద్రవ్యాలు, గుట్కాలపై నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. ఇందులో భాగంగానే పెద్ద కాపు లే అవుట్‌లోని కేశవులు ఇంట్లో సోదాలు నిర్వహించామని.. గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలను గుర్తించి సీజ్ చేశామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి సరిహద్దు వద్ద..
జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ను పోలవరం డీఎస్పీ లతాకుమారి పరిశీలించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను సిబ్బందితో కలిసి ఆమె తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా నిరంతరం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనల మేరకే వాహనాలను అనుమతించాలని సిబ్బందికి సూచించారు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఈ-పాస్ ఉంటేనే వాహనాలను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి రవాణా జరగకుండా మండలంలోని అన్ని సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తున్నారని వివరించారు. తనిఖీల్లో పట్టుబడ్డ మద్యాన్ని సీజ్ చేసిన అనంతరం సరకు రవాణా చేస్తున్న నిందితులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు చెక్ పోస్ట్ సిబ్బందికి డీఎస్పీ సూచనలు చేశారు.
Covid test Centers: రాష్ట్రంలో కొత్తగా 19 కొవిడ్ పరీక్షా కేంద్రాలు!