VRO Loan for Health: ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. అనారోగ్యం బారిన పడ్డాడు. సాఫీగా కొనసాగుతున్న తన జీవితంలో పక్షవాతం అనే రాక్షసి బారిన పడ్డాడు. వైద్యం కోసం పక్క రాష్ట్రంలో బెంగళూరుకు వెళ్లాడు కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఓబులేసు. ఆయన 2007లో వీఆర్వోగా రాయదుర్గంలో విధుల్లో చేరారు. అనంతరం కళ్యాణదుర్గం మండలానికి బదిలీపై వచ్చారు. తూర్పు కోడిపల్లిలో పనిచేస్తున్న సమయంలో రెండేళ్ల కిందట ఎడమ చేయి, కాలుకు పక్షవాతం వచ్చింది. ఆరు నెలలు బెంగళూరులో వైద్యం తీసుకున్నారు.
భార్య మంగళ సూత్రాలతో పాటు ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ,రెండు ఎకరాల పొలాన్ని కూడా అమ్మి ఎనిమిది లక్షలు తీసుకొచ్చి.. మరో రూ.22 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించుకున్నాడు. కొంతవరకు కోలుకున్నా ప్రస్తుతం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయం-4 లో విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా భార్య, కుటుంబ సభ్యులు సహకారం లేనిదే వెళ్లలేక పోతున్నాడు. తనకు వచ్చే నెలకు 27 వేల రూపాయలతో ప్రతి మాసం బెంగళూరులో ఆసుపత్రికి రూ. 22వేలు ఖర్చు అవుతుందని.. ఇలా అయితే ఎలా బతకాలని ఓబులేసు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ విషయంపై రెవెన్యూ ఉన్నత అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని.. ఒక ఆర్డీఓ మాత్రం రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడని.. మిగిలిన మొత్తాన్ని కూడా అధికారులు మంజూరు చేస్తే కొంత ఉపశమనం పొందుతామని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని భార్య రత్నమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయబద్ధంగా రావలసిన బిల్లులకే ఇలా చేస్తుంటే.. ఎవరిని ఆశ్రయించాలో కూడా అర్థం కావట్లేదని ఓబులేసు తీవ్ర ఆవేద వ్యక్తం చేస్తున్నాడు.
ఇవీ చదవండి: