అనంతపురం జిల్లాలో కరోనా కట్టడికి ఊరూవాడా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇదే తరుణంలో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు పక్కాగా దృష్టి పెట్టారు. మొదటగా కొద్దిరోజులు విన్నపాలు.. వేడుకోలుతో సరిపెట్టారు. అయినా.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోకుండా అత్యుత్సాహంతో అనర్థాలకు తావిస్తున్న వారి విషయంలో దూకుడు పెంచారు. పలువురు ఊరికే రోడ్ల మీదకు వచ్చేయడం.. సమయం ముగిసినా ఏదో వంకతో బైక్‌పై వీధులన్నీ చుట్టేయడం అలవాటుగా పెట్టుకున్నారు. చెప్పినా చెవికెక్కించుకోని వారిపై చలానాల మోత మోగిస్తున్నారు. ఇంకా మాట వినని వారి వాహనాలనూ స్వాధీనం చేసుకుని ఠాణాలకు తరలిస్తున్నారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటికి పోలీసులు విధించిన అపరాధ రుసుము విలువ ఏకంగా రూ.కోటి మార్కును దాటేసింది. అంతేకాదు... నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచిన, ఎక్కువ ధరలకు నిత్యావసరాలు అమ్మిన 775 దుకాణదారులపైనా కేసులు నమోదు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రయ్.. రయ్.. మని దూసుకెళ్లే ఉల్లంఘనులను అంతకు మించిన వేగంతో రయ్.. రయ్.. ‘మనీ’తో కట్టడి చేస్తున్నారు.
అవాక్కవ్వాల్సిందే
(వివిధ డివిజన్ల పరిధిలో లెక్కలు ఇవీ...)
అనంతలో అత్యధికంగా 444 మంది ఉల్లంఘనులు ఉండగా... పుట్టపర్తిలో ముగ్గురే ఉన్నారు. అనంతలో 258 కేసులు నమోదవగా.. అదేస్థాయిలో తాడిపత్రిలోనూ 235 నమోదయ్యాయి. అనంతలో ఏకంగా 12,453 మోటార్ వెహికల్ కేసులు నమోదవగా.. పుట్టపర్తిలో కనిష్ఠంగా 262 మాత్రమే. అనంతలో రూ.62.58 లక్షలు అపరాధ రుసుము వసూలు చేస్తే.. ధర్మవరంలో అత్యల్పంగా రూ.1.03 లక్షలు ఉంది. అనంతలో 134 వాహనాలు స్వాధీనం చేసుకోగా.. తాడిపత్రిలో ఆ సంఖ్య 110. ఇక పుట్టపర్తిలో ఏమీ లేవన్నమాట (0).
అందరూ సహకరించాలి
'కరోనా కట్టడికి ఇది కీలక తరుణం. లాక్‌డౌన్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. ప్రజలు ఎవరూ బయటకు రావొద్ధు.. ఇళ్లలోనే ఉండాలి. నిర్దేశిత సమయంలో.. అదీ నిత్యావసరాల కోసమే బయటకు రావాలి. నిబంధనలు మీరితే వాహనాలు సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. లైసెన్సు లేని వారు, ఇష్టారీతిన తిరిగే వారికి మాత్రమే అపరాధ రుసుము విధిస్తున్నాం'- సత్యఏసుబాబు, ఎస్పీ
ఇదీ చదవండి: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 918 కేసులు