Free Taxi for Drug Addicts : నూతన సంవత్సర వేడుకలు అంటేనే సహజంగా విందు, వినోదాలు గుర్తొస్తాయి. స్నేహితుల మధ్య జరుపుకునే విందు, వినోదాల్లో మద్యం ఏరులై పారుతుంది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా, కొత్త సంవత్సరంలో కుటుంబాల్లో విషాదం నింపకుండా ఉండాలని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ భావిస్తోంది. అందుకే ఓ సంచలనాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది. తమ వంతుగా డిసెంబర్ 31న ఉచిత క్యాబ్ సేవలు అందిస్తామని ప్రకటించింది.
కాల చక్రంలో మరో కొత్త ఏడాదికి సమయం ఆసన్నమైంది. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025 నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. న్యూఇయర్ సంబరాలకు ప్రతి ఒక్కరూ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో విందు, వినోదాలే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఏటా డిసెంబర్ 31రోజున మద్యం ఏరులై పారుతుండగా ఈసారీ అమ్మకాలు రికార్డులను తిరగరాస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా సైబరాబాద్, రాచకొండ పరిధిలోనూ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఈ రోజు రాత్రి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకలు - మెట్రో వేళలు పొడిగింపు, ఫ్లైఓవర్లు మూసివేత
ఉచిత రవాణా సౌకర్యం కల్పించడానికి దాదాపు 750 వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు నడపనున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా, ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నూతన సంవత్సర వేళ రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాల్లో విషాదం నిండకూడదనే తమ ఉద్దేశమని ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది.
ఇదిలా ఉంటే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయం పొడిగించింది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం కల్పించేందుకు చివరి రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయల్దేరుతుందని వెల్లడించింది. మెట్రో రైళ్లు దాదాపు 1:15 గంటలకు సంబంధిత గమ్యస్థానం చేరుతాయని హెచ్ఎమ్ఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎవరైనా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించినా, తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరించినా భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. మెట్రో కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎండీ కోరారు.
హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలు - అద్దిరిపోయే ఈవెంట్స్
'న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి - పరిమితులు దాటితే తప్పదు శిక్ష'