Farmers lost due to rains: అకాల వర్షం నెల్లూరు జిల్లా రైతులకు కోలుకోని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో వరి సాగు చేసిన రైతులు.. ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని.. సొంతంగా విక్రయిద్దామని భావిస్తే ఇంతలో వానొచ్చి ముంచేసిందని వాపోతున్నారు.
కృష్ణా జిల్లా.. మోపిదేవి మండలం క్రోసూరువారిపాలెం, నాగాయతిప్ప, మోపిదేవిలంక, మోపిదేవి, బొబ్బర్లంక గ్రామాల్లో.. టమాటా రైతులను వాన దెబ్బతీసింది. పొలాల్లో నీరు నిలవడంతో.. మొక్కలు ఉరకెత్తి పాడైపోయాయి. మిరప పంట పరిస్థితీ అంతే. జిల్లా మైలవరంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. ప్రభుత్వ యంత్రాంగం త్వరగా నష్టాన్ని అంచనా వేసి, రైతులను ఆదుకోవాలని కోరారు. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో ఏంచేయాలో తెలియడం లేదని.. రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు చేశామని.. కనీసం అందులో పావు వంతు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
పల్నాడు జిల్లాలో.. నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగురాళ్ల, ఈపూరు, రొంపిచర్ల, శావల్యాపురంలో వడగళ్ల వాన పడింది. నకరికల్లు, నరసరావుపేట, యడ్లపాడు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో చాలాచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు ఆగచాట్లు పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి పొలాల్లో ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. నెల రోజులుగా ధాన్యం పొలాల్లోనే ఉందన్న రైతులు.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అనంతపురం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ జిల్లాలోని నార్పల మండలం వెంకటంపల్లి రైతులు ఆందోళనకు దిగారు. వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. వారికి సంఘీభావం తెలిపిన సింగనమల తెలుగుదేశం ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ... ఫోన్లో అధికారులతో మాట్లాడారు. రైతుల గోడు వినిపించారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.
చంద్రబాబు డిమాండ్.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వదలని వానతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ధాన్యం, మొక్కజొన్న, మిరప, పెసర, మినుము పంటలతో పాటు అరటి, బొప్పాయి, మామిడి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో నిల్వ చేసుకున్న ధాన్యం తడిసిపోయి రైతులు నిండా మునిగారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఇతర పంటలు వేసి నష్టపోయిన వారినీ ఉదారంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వానలతో తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి డిమాండ్ చేశారు. నష్ట అంచనాల కోసం వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని కోరారు.
ఇవీ చదవండి: