ప్రతీ ఏటా.. అనంతపురం జిల్లా రైతులను కరవు కబళించేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... జిల్లాలో మాత్రం ఈ ఏడాది 48 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో ఏడున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగుచేయాల్సి ఉండగా, లక్షా 80 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. ఐదున్నర లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, లక్షా 25 వేల హెక్టార్లలో మాత్రమే సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలు లేక చాలాచోట్ల భూమిలోనే విత్తనం కలిసిపోయింది. జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికి సాగుచేసిన వేరుశనగ మొలక దశలోనే ఎండిపోయింది. పండ్ల తోటలు సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆత్మహత్యలే దిక్కంటూ కుమిలిపోతున్నారు.
ప్రాణాలు తీసుకుంటున్నారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెయ్యి నుంచి 12 వందల అడుగుల లోతులో ఉన్న బోర్లకూ నీరందని పరిస్థితి కరవు తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు బోర్ల కోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తోటల్లోని చెట్లను బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసలానే మారుతున్నాయి. తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక.... కుటుంబాన్ని పోషించలేక గడచిన 3 నెలల్లోనే 17 మంది రెతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబాలు అంతులేని ఆవేదనలో మునిగిపోయాయి.
జిల్లాలో ఒక్క ఎకరం భూమి కూడా పచ్చగా కళకళలాడుతూ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతుండటంతో.... జిల్లాలోని చెరువులు, కాలువలన్నింటికీ నీరందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి: