Farmers Stuck in Grip of Drought : రాష్ట్రంలో కరవు కోరలు చాస్తోంది. నైరుతి పవనాలు ముఖంచాటేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 15 జిల్లాల్లో సాధారణం కంటే 50 నుంచి 84 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. మరో 7 జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువగానే వానలు కురిశాయి. అంటే 22 జిల్లాల్లో వర్షాలు అనుకూలించలేదు.
అనంతపురం జిల్లాలో 84 శాతం, కోనసీమ జిల్లాలో 82 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి చూస్తే రాష్ట్రంలోని 56 శాతం మండలాల్లో పొడి వాతావరణమే ఏర్పడింది. 319 మండలాల్లో ఒక డ్రైస్పెల్ నమోదయ్యింది. అంటే వరసగా 21 రోజులు వానలు లేకపోవడం. అలాగే 63 మండలాల్లో రెండు డ్రై స్పెల్స్, ఒక మండలంలో మూడు డ్రైస్పెల్స్ నమోదవ్వడమే రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను తెలియజేస్తోంది.
Farmers Problems with Less Rains : జులైలోనూ వర్షాలు సాధారణంగానే నమోదైనా రాయలసీమలో లోటు వర్షపాతమే. జూన్‌లోనూ రాష్ట్రమంతటా 31.5 శాతం తక్కువ వానలు కురిశాయి. జూన్ 1 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పరిశీలిస్తే 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వానల్లేక ఆగస్టు 30 నాటికి సాధారణ విస్తీర్ణంలో 40 శాతం పంటల సాగు తగ్గింది.
No Rains in Anantapur District: చినుకు జాడ లేదయే.. సాగు చేసేది ఎలా..? ఉమ్మడి అనంత రైతన్న ఆవేదన
ఆగస్టు నెలాఖరుకు 85.97 లక్షల ఎకరాలకు 51.27 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. సాధారణం కంటే 34.70 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. గత ఖరీఫ్‌లో ఆగస్టు నాటికి నమోదైన విస్తీర్ణంతో పోలిస్తే సుమారు 17లక్షల ఎకరాల సాగు తగ్గింది. సాధారణ విస్తీర్ణంలో జొన్న 10 శాతం, వేరుసెనగ 44 శాతం, కంది 49 శాతం సాగు కాగా పత్తి 61, వరి 68శాతం చొప్పున పంటలు వేశారు.
Crops are Drying UP with High Temperatures : ప్రకాశం జిల్లాలో 20 శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు. వైయస్‌ఆర్ 29 శాతం, అన్నమయ్య 28%, పల్నాడు 30%, అనకాపల్లి జిల్లాలో 33%, శ్రీసత్యసాయి 35%, చిత్తూరు 37%, బాపట్ల జిల్లాలో 39% విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. వర్షాభావంతో అవి కూడా దక్కే పరిస్థితి లేదు. అధికశాతం మండలాల్లో ఎండుముఖం పట్టాయి. ముఖ్యంగా వేరుసెనగ, కంది చేతికొచ్చే పరిస్థితి లేదు. పత్తి మొక్క ఎదగడం లేదు. బలహీన రుతుపవనాలతో పాటు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులతో వర్షాలు తక్కువగా కురిశాయని వాతావరణశాఖ వెల్లడించింది.
'ఎండ మండుతోంది.. పైరు ఎండుతోంది'.. మరో రెండు రోజుల్లో అలా జరగకుంటే..!
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో తీవ్ర వర్షాభావంతో ఎండుతున్న పంటలను రక్షించుకోటానికి రైతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వేల రూపాయలు పెట్టి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటను తడపాల్సిన దుస్థితి తలెత్తింది. చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్న తీరును గుర్తించిన ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ట్రాక్టర్లు అద్దెకు తీసుకొని పంటలకు ఉచితంగా రక్షక తడులు అందిస్తోంది.
రాష్ట్రంలో 383 మండలాల్లో పొడి వాతావరణం నెలకొంది. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులో 31, ప్రకాశం 27, తిరుపతి 26, అనంతపురం 23, శ్రీసత్యసాయి 23, అన్నమయ్య 23, కర్నూలు 22, వైయస్‌ఆర్ జిల్లాలో 22 మండలాలున్నాయి. రెండు డ్రైస్పెల్స్ ఉన్న మండలాలు... అనంతపురం జిల్లాలో 9, వైయస్‌ఆర్ జిల్లాలో 8, కర్నూలు 8, పల్నాడు 6, తిరుపతి 6, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు 4, ఏలూరు 3, అన్నమయ్య 3, శ్రీసత్యసాయి 3, నంద్యాల 3, ప్రకాశం 2, కాకినాడ2, విశాఖపట్నం2, శ్రీకాకుళం 1, అనకాపల్లి 1, అంబేడ్కర్ కోనసీమ1, చిత్తూరు జిల్లాలో 1 ఉన్నాయి.