తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ తయారీదారు గ్లెన్ బ్రిగ్స్ ముఠాలో మరో ముగ్గురిని అనంత పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్లెన్ బ్రిగ్స్, అతని ముఠా సభ్యులను విచారించిన పోలీసులకు మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుత్తి స్పెషల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూనే గ్లెన్స్ బ్రిగ్స్ పోలీసుల సహకారంతో నిత్యం వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల విభాగాలకు చెందిన 393 నకిలీ సర్టిఫికెట్లు, వాటికి సంబంధించిన 215 నకిలీ పత్రాలు, కొన్ని రిజిస్ట్రేషన్ స్టాంపులు, నకిలీ ఇళ్ల పట్టాలు, డీడీలు, 138 నకిలీ సీళ్లు, హాలోగ్రామ్స్, మూడు బైక్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లంచానికి అమ్ముడుబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లు సుధీర్ రెడ్డి, ఫణిభూషణ్ రెడ్డిలు నిందితుడికి ఫోన్లు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. జైలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మరోవైపు ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పోలీసు శాఖకు సంబంధించిన కొన్ని రహస్యాలను గ్లెన్స్ బ్రిగ్స్కు చేరవేసినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసుల లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి