YCP Leader Harassment: అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు చెప్పగానే.. వైసీపీ ప్రజాప్రతినిధుల ఇసుక మాఫియా గుర్తుకొస్తుంది. ఇప్పుడు వారి దౌర్జన్యాలు ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. వీరి ఆగడాలకు దశాబ్దాలుగా నడుస్తున్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. యాడికి మండలం రాయలచెరువులో దాదాపు 3 దశాబ్దాలుగా స్టీటైట్, డోలమైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి. గనుల నుంచి బలపం రాయి కొని పరిశ్రమకు తరలించడానికి 98 మంది మినరల్ డీలర్లు లైసెన్సులు పొందారు. వీరిలో 44 మందికి పరిశ్రమలు ఉండగా.. మిగిలిన లైసెన్సుదారులు కేవలం గనుల నుంచి కొని.. పరిశ్రమలకు సరఫరా చేసే వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. ఈ పరిశ్రమల్లోని 13 రైల్వేట్రాక్‌కు సమీపంలో ఉన్నాయి. వీటిల్లో 8 తెలుగుదేశం సానుభూతిపరులవని తెలుసుకున్న తాడిపత్రికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి.. వేధింపులు ప్రారంభించారు. ఈ 8మందితో పాటు బలపం పౌడర్ ఎగుమతుల వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న.. ఏ పార్టీకీ సంబంధం లేని మరో ఐదుగురు యజమానులను లక్ష్యంగా చేసుకున్నారు.
కట్టుకథ అల్లారు: వైసీపీలో చేరతారా లేదా నెలవారీ మామూళ్లు ఇస్తారా అంటూ బెదిరింపులకు దిగారు. పరిశ్రమల్లో ఏకంగా భాగస్వామ్యం ఇవ్వాలని పెద్ద వ్యాపారులను బెదిరించారు. వీరంతా దారికి రాకపోవడంతో మైనింగ్ అధికారులను రంగంలోకి దింపారు. రైల్వే ట్రాక్ సమీపంలోని పరిశ్రమల నుంచి వచ్చిన దుమ్ము కంట్లో పడిదంటూ చాలా ఏళ్ల క్రితం ఓ రైలు ప్రయాణికుడు ఫిర్యాదు ఇచ్చినట్లు కట్టుకథ అల్లారు. దీన్ని ఆధారంగా చేసుకుని 3 దశాబ్దాలుగా నడుస్తున్న 13 పరిశ్రమలను 8 నెలల క్రితం మూయించేశారు. ఇక్కడ పనిచేసే వేలాది మంది కూలీల పొట్టకొట్టారు.
ప్రభుత్వానికి నష్టం: రాయలచెరువు పంచాయతీలోని బలపుం పౌడర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ పొడిని కాగితపు పరిశ్రమలు, టూత్ పేస్టులు, టాల్కమ్ పౌడర్, సౌందర్య లేపనాల పరిశ్రమల్లో ప్రధాన ముడి సరకుగా వినియోగిస్తారు. ప్రతి నెలా వెయ్యి లారీల లోడ్ అక్కడి నుంచి ఎగుమతి అవుతూ.. ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయల మేర రాయల్టీ, జీఎస్టీ రూపంలో మరో కోటిన్నర వరకూ వస్తోంది. ఒక్కో పరిశ్రమ నుంచి.. ప్రతినెలా 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు విద్యుత్ ఛార్జీలు వసూలవుతున్నాయి. వందలాది మంది కూలీలకు జీవనోపాధి లభిస్తోంది. ఈ పరిశ్రమలపై వైసీపీ ప్రజాప్రతినిధి కన్నుపడటంతో.. పరిశ్రమల యజమానులు, కూలీలు రాబడి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
పట్టించుకోని పోలీసులు: దశాబ్దాలుగా లేని నిబంధనలను తెరమీదకు తీసుకొచ్చి.. పారిశ్రామికవేత్తలు, మినరల్ లైసెన్స్ డీలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధి చెప్పినట్లు నడుచుకోండి అంటూ అధికారులు పరిశ్రమల యజమానులకు ముఖంమీదే చెప్పేస్తున్నారు. పరిశ్రమలు మూయించడమే అభివృద్ధా అంటూ.. తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ప్రజాప్రతినిధి దందాతో మూతపడిన బలపం పరిశ్రమల వ్యవహారంపై పోలీసులు కన్నెత్తి చూడని పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"ఫ్యాక్టరీ పనికి వస్తేనే మేము బతకగలం సర్. మమ్మల్ని వేరే పనికి కూడా ఎవరూ పిలవడంలేదు. బయట పనులకు వెళ్తే తక్కువ కూలి ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా ఫ్యాక్టరీలు మూసేశారు. దీంతో వందల మంది ఇంటి దగ్గరే ఉంటున్నారు". - రంగమ్మ, కూలీ
"ఈ ఫ్యాక్టరీలు మూయించడం వలన సుమారు 2వేల మంది ఉపాది కోల్పోయారు. దీని వలన.. చాలా తక్కువ డబ్బులు ఇచ్చినా వేరే కూలి పనులకు వస్తున్నారు. ఈ చర్యలన్నీ ఒక రాజకీయ కక్షతోనే జరుగుతుంది". - చరణ్, టీడీపీ నాయకుడు
"ఎప్పుడు కూడా.. ఈ ఫ్యాక్టరీల జోలికి ఎవరూ రాలేదు. కానీ 8 నెలల క్రితం పొల్యూషన్ పేరుతే మూసేశారు. దీని ద్వారా ప్రభుత్వం కూడా చాలా ఆదాయం కోల్పోయింది. ప్రజలు నష్టపోయారు". - రంగయ్య, టీడీపీ నాయకుడు
ఇవీ చదవండి: