Drinking Water Problem in Anantapur District: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామాల్లో తాగునీటి సమస్య పెచ్చుమీరుతోంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పంపింగ్ తగ్గిపోవటంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉరవకొండలో తాగునీటి కోసం స్థానికులు రోడ్లపైకి వస్తున్నారు.
పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి.. రోజుకు 36 లక్షల లీటర్ల తాగునీటిని పంపింగ్ చేయాల్సి ఉండగా.. 15 లక్షల లీటర్లనే అధికారులు పంప్ చేస్తున్నారు. దీని కారణంగా నీటి సమస్య తలెత్తి.. అనేక కాలనీల్లో 10 రోజులకోసారి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. విడపనకల్లు బీసీ కాలనీకి ఆరు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవటంతో.. మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే మండలంలోని చీకలగుర్కి ఎస్సీ కాలనీకి.. 40 రోజులకోసారి రంగుమారిన నీటిని.. అధికారులు విడుదల చేస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో.. రోజూ రెెండు వందల రూపాయలు నీటి కోసం వెచ్చించాల్సి వస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో వేసవి సమీస్తున్న సమయంలో.. నీటి సరఫరాకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేవారని ప్రజలు అంటున్నారు.
పంచాయతీ నిధుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారని.. బోర్లు రిపేర్ చేసేవారని గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు కేంద్ర నుంచి వస్తున్న నిధులను కూడా తీసుకుటుంది. దీంతో సమస్య మరింత పెరుగుతోంది. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఆర్డబ్య్లూఎస్కు నిధులు విడుదల చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సమస్య, రంగుమారిన నీటి సరఫరాపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. స్పందించటంలేదని పల్లెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని.. బోర్ల రిపేర్‌కు నిధులు కేటాయించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
"మాకు నీళ్లు రావడం లేదు. వచ్చినా కూడా రాత్రి ఒంటి గంట సమయంలో వస్తున్నాయి. అవి కూడా మంచిగా ఉండటం లేదు. ఆ నీరు తాగి రోగాల బారినపడుతున్నాం. మేము అనేక సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏవేవో కారణాలు చెప్తున్నారు". - పెద్దన్న, స్థానికుడు
"మాకు అసలు నీళ్లు రావడం లేదు. పది రోజులకు, ఇరవై రోజులకు ఒకసారి వస్తున్నాయి. వచ్చినా ఎక్కువ సమయం రావడం లేదు. నీళ్లు మంచిగా లేకపోవడం వలన.. వాటిని తాగడం వలన వాంతులు, జ్వరాలు వస్తున్నాయి. తాగాలంటే భయపడుతున్నాం". - చెన్నకేశవులు, స్థానికుడు