అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ నియామకం కోసం.. ఆ నియోజకవర్గ నేతలంతా తెదేపా జిల్లా అధ్యక్షుడిని డిమాండ్ చేస్తున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తెదేపాను వీడిన పరిస్థితుల్లో.. అక్కడి కార్యకర్తలతో తెదేపా జిల్లా అధ్యక్షులు పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు సేకరించారు.
గతంలో పరిటాల రవీంద్రకు ధర్మవరం ప్రజలతో మంచి సంబంధాలుండేవని, అందువల్లే పరిటాల శ్రీరామ్‌ను నియోజకవర్గ బాధ్యుడిగా నియమించాలని కార్యకర్తలు కోరారు. ప్రస్తుతం రెండు వర్గాలుగా ఉన్న తెదేపా నాయకులంతా... పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో కలిసి పనిచేస్తామని ముఖాముఖి సమావేశంలో జిల్లా నేతలకు స్పష్టం చేశారు. మండల స్థాయి నాయకుల అభిప్రాయాలను అధిష్ఠానానికి పంపించి, తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముందుకు వెళతామని తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి తెలిపారు.