ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని... భాజపా మహిళా మోర్చా జాతీయ నేత పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె... వైకాపా ప్రభుత్వం ప్రజారంజక పాలన ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో... ఆ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారంతా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారన్నారు.
పోలవరంపై రివర్స టెండర్లకు వెళ్లటం తప్పులేదని... అయితే పనులు నిలిపివేయటం సరైనది కాదన్నారు. ప్రజలు కోరుకున్న మార్పు 6 నెలల పాలనలో ఏమాత్రం కనిపించలేదని అభిప్రాయపడ్డారు. ఇసుక లభ్యత లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర రాజధానిని శ్మశానంతో పోల్చటం ఎంతవరకు సమంజసమో మంత్రులు, ప్రభుత్వమే ఆలోచించాలన్నారు.
రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్ల ఇచ్చినా... గతంలో తెదేపా ప్రభుత్వం పనులు పూర్తిచేయటంలో విఫలమైందన్నారు. చంద్రబాబు పర్యటనలో రాళ్లదాడిపై ఆమె స్పందించారు. రాజధాని నిర్మించలేదని ప్రజల్లో బాధ ఉన్నప్పటికీ... ఇలా దాడులు చేయటం సమంజసం కాదన్నారు.
ఇదీ చదవండి