అనంతపురం నగరపాలక సంస్థతోపాటు.. మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. అనంత నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో వైకాపా, తెదేపాతోపాటు.. జనసేన, భాజపా, కాంగ్రెస్‌తోపాటు.. వామపక్షాలు తమ అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. ఈసారి తెలుగుదేశంతో సీపీఐ జతకట్టనుంది. నగరంలోని 50 డివిజన్లలో నాలుగు స్థానాలు సీపీఐకి కేటాయించే అవకాశం ఉంది. సీపీఎం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వైకాపా, తెలుగుదేశంలో నియోజకవర్గ నేతలే పురపోరులో గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. అనంతపురం నగరపాలక సంస్థలో తెదేపా 33 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. అభ్యర్థులెవరూ కార్యాలయంలో వాటిని సమర్పించలేదు.
వైకాపాలో అభ్యర్థుల ఎంపిక, బీ ఫారాలు ఇచ్చే వ్యవహారమంతా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డే చూస్తున్నారు. ఆయనతో విభేదిస్తున్న పార్టీలోని మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, హరిత, శివారెడ్డి విడిగా నామినేషన్లు వేశారు. వీరంతా మేయర్ పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ఆహ్వానంతో తెలుగుదేశంలో బీ ఫారం అందుకుని వైకాపాలోకి వచ్చిన మాజీ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డితో పాటు వెంకటరామిరెడ్డి వర్గంలోని కొగటం విజయభాస్కర్ రెడ్డి కూడా మేయర్ పదవి కోసం పోటీపడుతున్నారు. స్థానికంగా ఉన్న వసీం అనే మైనార్టీ వ్యక్తిని కూడా ఎమ్మెల్యే తెరపైకి తెచ్చారు. వీరిలో ఆఖరికి బరిలో ఎవరుంటారనేది ఆసక్తిగా మారగా.. మేయర్ అభ్యర్థి ఎంపిక వెంకటరామిరెడ్డికి కత్తిమీద సాములా మారింది. అభ్యర్థులపై పార్టీపరంగా సర్వే చేయించామంటున్న ఎమ్మెల్యే.. త్వరలోనే ఖరారు చేస్తామని చెబుతున్నారు.
తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక బాధ్యతను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చూస్తున్నారు. గతంలోనే 33 మందికి బీ ఫారం ఇచ్చినప్పటికీ.. ఆ అభ్యర్థుల్లో కొందరిని మార్చాల్సిన అవసరంపై పరిశీలన చేస్తున్నారు. చాలాకాలంగా జేసీ సోదరులతో, ప్రభాకర్ చౌదరికి విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ చురుకుగా ఉంటున్నారు. సీట్ల కోసం తెలుగుదేశం కార్యకర్తలు.. పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే బీ ఫారం ఇచ్చే బాధ్యతను అధిష్టానం ప్రభాకర్ చౌదరికి అప్పగించటంతో.. ఉపసంహరణ రోజుకు పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
పంచాయతీ ఫలితాలతో ప్రజలు వైకాపాతోనే ఉన్నారని మరోసారి తేలిందంటూ అధికార పార్టీ నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు గతంలో జిల్లాలో చేసిన అభివృద్ధే తమను విజయతీరాలకు చేరుస్తుందని తెలుగుదేశం వర్గాలు ఆశాభావంగా ఉన్నాయి.
ఇవీ చూడండి...: అనంతపురం, నెల్లూరు జిల్లాలకు పీఎం కిసాన్ పురస్కారాలు