CPI RAMAKRISHNA FIRES ON GOVT : అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలకు రైతులు లక్షల ఎకరాల్లో తీవ్రంగా పంటలు నష్టపోయారని.. అందుకు గాను ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వరదల వల్ల ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తోందని, లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతే కేవలం 9,800 ఎకరాల్లో మాత్రమే పంటలు నష్టపోయారని నివేదికలు తయారు చేయటంపై ఆయన మండిపడ్డారు.
వాణిజ్య పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున, పండ్ల తోటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై.. నాణ్యమైన కరెంటు కోసం మోటార్లు బిగిస్తున్నామని చెప్పి నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇస్తున్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తక్షణమే రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
CPM AND CONGRESS LEADERS PROTEST : హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, కాంగ్రెస్ నాయకులు అనంతపురం జిల్లా బళ్లారి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల హంద్రీనీవా అధికారులు పది రోజుల క్రితం కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. కాలువకు అనుకొని ఉన్న వేలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. దాదాపు రూ.లక్షలు పెట్టి విత్తనాలు, ఎరువులు ఇలా తెచ్చుకున్నాక ఉన్నట్టుండి నీరు నిలిపివేయడం దారుణమని రైతులు వాపోయారు. సీపీఎం, కాంగ్రెస్ నాయకులు దాదాపు అరగంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్పి పంపించారు. ప్రభుత్వం స్పందించి త్వరగా కాలువలకు నీరు అందించి పంటలను కాపాడాలని.. లేనిపక్షంలో మరోసారి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు.
ఇవీ చదవండి: