అనంతపురం నగరపాలక సంస్థలో మేయర్ పదవి ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ పదవిని దక్కించుకొనేందుకు నగరంలోని వైకాపా ముఖ్యనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది మార్చిలోనే నామినేషన్లు వేసిన వైకాపా ముఖ్యనేతలు..ఏడాదిగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు నామినేషన్ల ఉపసంహరించుకునేలా ప్రజాప్రతినిధులు పావులు కదిపినట్లు తెలిసింది. సోమవారం అనంతపురం వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.... మేయర్ పదవి ఆశిస్తున్నవారితో భేటీ అయ్యి నచ్చచెప్పినట్లు తెలిసింది.
ఆరుగురు వైకాపా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ
సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన వైకాపా నేతలు... ప్రస్తుతం కనీసం మేయర్ పదవినైనా దక్కించుకోవాలని భావిస్తున్నారు. అనంత నగరంలో మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి, వైటీ శివారెడ్డి కుమారుడు మణికంఠ రెడ్డి, కొగటం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మేయర్ పరుశురాం భార్య బండి నాగమణి, వాసీం మేయర్ పదవి ఆశిస్తూ వైకాపా కార్పొరేటర్లుగా నామినేషన్ వేశారు. వీరంతా ఎవరికి వారే తమకే మేయర్ పీఠం దక్కేలా పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి బొత్స, సజ్జల ఎదుట తమ అభ్యర్థనలు చెప్పుకున్నారు. ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకుండా..... అంతా అధిష్టానం నిర్ణయిస్తుందన్న నేతలు...మంచి మెజారిటీతో గెలవటంపై దృష్టిపెట్టాలని ఆశావహులకు చెప్పారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాత్రం 3 సామాజిక వర్గాల నుంచి పోటీపడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరికి మేయర్ పదవి ఇవ్వాలంటూ సజ్జల ఎదుట వివరించినట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన తర్వాతే వైకాపా మేయర్ అభ్యర్థిపై స్పష్టత రానుంది.
ఇదీ చదవండి: