ప్రభుత్వం అందించే సేవలను పొందేందుకు లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని అధికారులను అనంపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం రాత్రి కదిరి మండలం రామదాసు నాయక్ తండాలో బసచేసిన కలెక్టర్.. ఈ ఉదయం పరిసర తండాలైనా మీట్ ఏ నాయక్ తండా, బోడె నాయక్ తండాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బోడె నాయక్ తండాలో గంగాధర్ నాయక్- అంజనమ్మ బాయి దంపతులు బియ్యం కార్డులో కుమారుడి పేరును చేర్చడానికి మూడు నెలల కిందట దరఖాస్తు చేసుకున్నట్లు ఆయనకు విన్నవించారు. పది రోజుల్లో జారీ చేయాల్సిన బియ్యం కార్డు మూడు నెలలపాటు జాప్యం ఎందుకు జరిగిందని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే పూర్తిచేయాలని అధికారులను అదేశించారు. అలసత్వం ప్రదర్శించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎర్రదొడ్డి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసిన ఆయన... సిబ్బందికి వివిధ అంశాలపై మార్గదర్శనం చేశారు.