అనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్లపల్లికి చెందిన మంజుల, రమణ దంపతులు. వీరికి గ్రామంలోని సర్వేనంబరు 652లో 85సెంట్ల సాగు భూమి ఉంది. మంజుల భర్త రమణ దివ్యాంగుడు. వీరికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకోవటం తెలియదు.
వారి అవసరాన్ని తెలుసుకున్న సమీప బంధువుకు దుర్బుద్ధి పుట్టింది. అతను మరికొందరితో కలిసి పాసుపుస్తకం చేయిస్తామంటూ రెండు, మూడుసార్లు బాధితుల నుంచి లక్షా 29వేల రూపాయలు తీసుకున్నారు. అంతటితో ఆగక ఈ దంపతుల భూమిలో 24సెంట్ల భూమిని మరో వ్యక్తికి విక్రయించారు. అంధుడైన రమణను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు పిలిపించి పాసు పుస్తకం కోసమంటూ సంతకం చేయించుకుని అతని భూమిని విక్రయించేశారు.
విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్సై రంగడు జరిగిన విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లి 24సెంట్ల భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు. నిందితులపై చర్యలు తీసుకుని తమ సొమ్మును ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చూడండి