తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో రెండోరోజు పర్యటించారు. గురువారం ఉదయం వైకాపా బాధితుల భేటీతో మొదలైన చంద్రబాబు కార్యక్రమాలు... రాత్రి రెండు గంటల వరకు కొనసాగాయి. ఎన్నికల అనంతరం 6 నెలల వైకాపా పాలనలో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు ఎదుట వాపోయారు.
కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ... తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. పదవీ విరమణ పొందినా చట్టరీత్యా శిక్షపడేదాకా వదలనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
గురువారం మధ్యాహ్నం నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు... గ్రామ పంచాయతీల వారీగా పార్టీ బలాబలాలపై చర్చించారు. మడకశిర, రాయదుర్గం, పెనుకొండ, శింగనమల, తాడిపత్రి నియోజకరవర్గాల నాయకులు, కార్యకర్తలతో వేర్వేరుగా మాట్లాడారు. ఓటమికి కారణాలపై పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు తమ విశ్లేషణలు అధినేతకు చెప్పారు. పథకాలు అమలు చేశాం... గెలుపు తథ్యమని అతివిశ్వాసం చూపటంవల్లే ఓటమి పాలైనట్లు కొందరు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
రాత్రి బాగా ఆలస్యం కావటంతో... శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో ఏకకాలంలో... రాప్తాడు శ్రేణులతో వేరుగా సమీక్ష నిర్వహించారు. ఇవాళ హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రంలోగా అన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తిచేసి... బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి అమరావతికి చేరుకోనున్నారు.
ఇదీ చదవండీ...