Bus Yatra for Special Status: రాష్ట్ర ఎంపీలు ప్రత్యేక హోదా సాధించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వైసీపీ ఎంపీలను డిమాండ్ చేశారు. అనంతపురంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి సంఘాలతో నిర్వహిస్తున్న బస్సు యాత్రను రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, సీపీఎం జిల్లా నేత ఓబుల కొండారెడ్డిలు ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన నేతలు జండా ఊపి బస్సు యాత్రను ముందుకు తీసుకెళ్లారు. విభజన హామీలు సాధించటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
గతంలో చేసిన ఉద్యమంతో కేవలం 15 శాతం హామీలు మాత్రం నెరవేర్చారని నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీకి గుజరాత్ అభివృద్ధి తప్ప ఏమీ పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. విభజన హామీల సాధనకు రాష్ట్రంలో కలిసివచ్చే విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని నేతలు చెప్పారు. అనంతపురంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఫిబ్రవరి నాలుగున ఇచ్చాపురం చేరుకుంటుందని నేతలు చెప్పారు.
"నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి.. నేను పోరాడతాను.. నిలదీస్తాను.. మెడలు వంచుతాను అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎంపీలు ఏమైనా దిల్లీలో నిద్రపోతున్నారా.. ఒక్కరు కూడా ఎందుకు ప్రత్యేక హోదా కోసం మాట్లాడటం లేదు. ఎంపీలు అందరూ.. మీకు చేతనైతే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దిల్లీలో మాట్లాడండి. లేదంటే వెంటనే రాజీనామా చేయండి". - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
"ప్రత్యేక హోదా అనేది ముగిసిన చాప్టర్ అని చెప్పినవాళ్లు.. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారు. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం". - చలసాని శ్రీనివాస్, ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు
ఇవీ చదవండి: