అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వస్తున్న బాధితులు పెద్దసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ముందుగా ఆస్పత్రి వస్తున్న రోగులకు పడకల కోసం నిరీక్షణ తప్పడం లేదు.
కంబదూరు ప్రాంతానికి చెందిన ఆర్మీ ఉద్యోగి హనుమంతు రాత్రి 12 గంటల సమయంలో ప్రభుత్వాసుపత్రికి వస్తే... బెడ్స్ లేక ఇప్పటికి ఆంబులెన్స్ లోనే వేచిచూడాల్సిన పరిస్థితి. ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించే తనకు.. ఆస్పత్రిలో పడక ఇవ్వడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు వాపోయాడు. చేసేది లేక పడక కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలివెళ్లారు.
బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లె ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వీల్ చైర్ పైనే మృతి చెందింది. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రిలో పడకలు పెంచి అత్యవసరంగా వస్తున్న బాధితులకు చికిత్స అందించాలని బాధిత బంధువులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
పెరిగిన రెండో మాస్క్ వినియోగం.. వైద్యుల సూచనలతో ఆచరిస్తున్న జనం