ఆమె తరగతి గదిలో ఉంటే హాజరు పట్టిక పరుగులు పెడుతుంది. ఆమె పాఠాలు చెబుతుంటే.. పిల్లలంతా ఎంతో శ్రద్ధగా వింటారు. ఆమె పని చేస్తున్న పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అవార్డులు ఆమెను వెతుకుంటూ వస్తాయి. సరికొత్త విధానాలతో పిల్లలకు అర్ధమయ్యే సులభమైన పద్దతుల్లో పాఠాలు బోధిస్తూ... వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుంటూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న లక్ష్మీనరసమ్మ.
బోధనలో కొత్త పద్దతులను అవలంబిస్తూ.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు లక్ష్మీ నరసమ్మ. తరగతి గది మొత్తం విద్యార్థులు తయారుచేసిన రకరకాల బొమ్మలతో నిండిపోయింది. లో కాస్ట్ నో కాస్ట్, టిఎల్ఎం, గ్లిట్టర్ పేపర్ టిష్యూ పేపర్లతో... నో బ్యాగ్ డే యాక్టివిటి ద్వారా విద్యార్థులతోనే బోమ్మలు తయారు చేయిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య, నాటికల ప్రదర్శనలో శిక్షణ ఇస్తున్నారు. బడితోట కార్యక్రమంతో విద్యార్థుల పర్యవేక్షణలో మొక్కలు పెంచుతున్నారు. దీంతో పాఠశాలలో పిల్లల హాజరు శాతం పెరగడంతోపాటు, విద్యార్ధుల సంఖ్య కూడా పెరుగిందంటున్నారు తోటి ఉపాధ్యాయులు.
ఆసక్తికరమైన బోధన ద్వారా ఆమె ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. వీటిలో సావిత్రిబాయి పూలే అవార్డు, ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ అవార్డు, మహిళా శిరోమణి అవార్డు, ప్రతిభా రత్న అవార్డు, చదువుల తల్లి, అబ్దుల్ కలాం అవార్డు, 2017 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2019లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఎన్ని అవార్డులు వచ్చినా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమంటున్నారు. ఇద్దరు నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుని వారిని చదివిస్తూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు లక్ష్మీ నరసమ్మ
సమాజంలో పేద విద్యార్ధులను ఉన్నత స్థానంలో నిలపాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సోంత ఖర్చులతో పిల్లల భవితకు బాటలు వేస్తున్నారు ఆంగ్ల ఉపాధ్యాయని లక్ష్మీ నరసమ్మ.
ఇవీ చూడండి...