Babu Surety Future Guarantee Program: సీఎం జగన్ పాలనలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు పర్యటనకు ప్రజలు నీరాజనం పలికారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించిన ఆయన క్షణం తీరిక లేకుండా ప్రజల మధ్యలోనే గడిపారు. ఈ నెల 5వ తేదీన రాయదుర్గం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించగా పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు.
Chandrababu Comments in Gooty Public Meeting: రాష్ట్రాన్ని కాపాడటం కోసమే.. జగన్‌పై పోరాటం: చంద్రబాబు
Chandrababu Roadshow in Guntakallu Constituencies: బుధవారం కళ్యాణదుర్గం, గురువారం గుంతకల్లు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రజలకు భవిష్యత్ హామీ ఇచ్చారు. ప్రకృతి వనరులను దోచుకుంటూ ప్రజలపై ధరలు, పన్నుల భారం మోపుతున్న సైకో ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మద్యం ధరలు పెంచేసి కల్తీ మద్యంతో పేదల రక్తం తాగుతున్నాడని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గుత్తి చెరువుకు ఎమ్మెల్యే నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. స్థానికంగా లభ్యమయ్యే ప్రకృతి వనరులను ఆయన కుటుంబం కొల్లగొడుతుందన్నారు. గుత్తిలో తన సభకు విద్యుత్ నిలిపివేతపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. తమను బాధపెట్టే ప్రతి ఒక్కరి చిట్టా తయారవుతుందని హెచ్చరించారు.
Chandrababu Meeting with Lawyers: రాయదుర్గంలో న్యాయవాదులు, మేధావులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత మీదేనంటూ విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులను కించే పరిచే మంత్రులతో క్యాబినెట్ నిర్వహిస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపాలని కోరారు. కళ్యాణదుర్గంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ రాయితీలను ఓసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. జగన్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తోందని ఆరోపించారు.
Electric Meters for Agricultural Motors: తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు వేయకుండా వ్యతిరేకించగా.. జగన్ ప్రభుత్వం మీటర్లు పెట్టి రైతులకు ఉరి వేస్తోందని విమర్శించారు. అనంతపురం జిల్లాలో రైతులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా తాను అన్నదాతలను సిద్ధం చేస్తానన్నారు. సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి, వ్యవసాయం చేస్తూనే విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఆయన అన్నారు. మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు. సంపద సృష్టించి, ఆ సంపదను ప్రజలకు పంచే పార్టీ తెలుగుదేశం పార్టీనేనని ఆయన చెప్పారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తిలో రోడ్‌షో అనంతరం చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
Chandrababu Tour Will End in Anantapur District and Enter Nandyala District: చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నంద్యాల జిల్లాలో ప్రవేశించనున్నారు. ప్యాపిలి వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 8వ తేదీ శుక్రవారం బనగానపల్లిలో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం అవుతారు. భోజనం అనంతరం పాణ్యం మీదుగా నంద్యాలకు చేరుకుని.. గాంధీ చౌక్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి నంద్యాలలోనే బస చేయనున్నారు. 9వ తేదీ శనివారం ఉదయం సంక్షేమ పథకాలపై స్థానికులతో సమావేశం కానున్నారు. భోజనం అనంతరం కర్నూలు చేరుకుని చెన్నమ్మ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు.