జనాభాతో పోలిస్తే అనంతపురం జిల్లాలో లక్షల మంది ఓటర్లు దూరంగా ఉన్నారు. 18-30 ఏళ్లులోపు వయసున్న వారు 9,39,335 మంది ఉండగా.. 6,94,662 మందికే ఓటుహక్కు ఉంది. 2,44,673 మంది ఓటరుగా నమోదు కాలేదు. జనాభాతో పోలిస్తే 20.48 శాతం ఓటర్లు ఉండాలి. కానీ 15.1 శాతమే ఉన్నారు.
18-19 ఏళ్లలోపు అత్యధికం
18-19 ఏళ్ల వయసున్న యువత జిల్లాలో 1,11,336 మంది ఉండగా వారిలో 23,855 మంది మాత్రమే ఓటర్లు. 0.5 శాతమే ఉన్నారు. అర్హులైన 87,481 మంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది.
మహిళల ముందంజ
ప్రతి వెయ్యి మంది పురుషుల్లో 977 మంది మహిళా ఓటర్లు ఉండాలి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 395 మంది, ఉరవకొండలో 953, గుంతకలుల్లో 2,316, అనంతపురం అర్బన్‌లో 3,052, పుట్టపర్తిలో 559, ధర్మవరంలో 1,170, కదిరిలో 1,403 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో 33,28,931 ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఇ-ఎపిక్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ నెల 25న కేంద్ర ఎన్నికల సంఘం ఇ-ఎపిక్ కార్డుల పంపిణీ ప్రారంభించనుంది. ఆ తర్వాత ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరూ పొందవచ్ఛు ఈ కార్డులు పొందేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలతో పాటు మీసేవ కేంద్రాలు, ఓటు నమోదు అధికారి కార్యాలయాల్లో, కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కు
"ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల చేతిలోని వజ్రాయుధం. రాజ్యాంగం నుంచి సంక్రమించిన ఈ హక్కును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా ఓటుతో సమాజానికి నిస్వార్థంతో సేవ చేసే నాయకులను ఎన్నుకోవాలి. ముఖ్యంగా యువత మరింత బాధ్యతగా వ్యవహరించాలి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి" - పార్వతి, జిల్లా పంచాయతీ అధికారి
యువత ముందుకు రావాలి
"దేశ భవిష్యత్తు యువతపై ఉంది. ఎన్నికల సంఘం ప్రత్యేక నమోదు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకొంటున్నాం. 18 ఏళ్లు నిండి ఓటు నమోదు చేసుకున్న ప్రతి యువతకు ఓటరు కార్డు అందించి సత్కరిస్తాం. యువత ఓటు నమోదు శాతం తక్కువగానే ఉంది. అందరూ ముందుకు రావాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటుహక్కు పొందాలన్నదే ఎన్నికల సంఘం ప్రధాన ఆశయం" - గంధం చంద్రుడు, కలెక్టర్
ప్రజల చేతిలో ఆయుధం
"ప్రజాస్వామ్య దేశంలో కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. వారంతా నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అర్హులే. ఓటు నమోదే కాదు.. హక్కును వినియోగించుకోవాలి. ఒక్కసారి మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి" - నిశాంత్‌కుమార్, జేసీ
ఓటెత్తితేనే భవితకు బాట
నోటు మాట మరవాలి. యువత ప్రజాస్వామ్యం పరిఢవిల్లడంలో భాగస్వామ్యం కావాలి. ఓటెత్తితేనే భవితకు బాట అని యువత పేర్కొంటున్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని అనంతపురంలోని ఎస్కేయూ, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాలు, ఆర్ట్స్ కళాశాల, కేఎస్‌ఎన్ కళాశాలల్లో ‘ఈనాడు’ సర్వే నిర్వహించింది. వంద మంది యువత ఇందులో పాల్గొన్నారు.
జిల్లా జనాభా 46.04 లక్షలు. ఈ నెల 15న తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. 14 నియోజకవర్గాల్లో 33,28,931 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 16,64,761, మహిళలు 16,63,888, ఇతరులు 282. సర్వీసు ఓటర్లు 3,328 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. నాలుగు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లంతా తమ హక్కును వినియోగించుకోవాలి.
‘విధి’ నిర్వర్తించాలి!
హిందూపురంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలోని త్యాగరాజ్‌నగర్‌లో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ఓటుపై చైతన్యం కలిగించారు. సహాయ ప్రధానాచార్యులు హేమత, కళాశాల సూపరింటెండెంట్ నరసింహులు విద్యార్థులను అభినందించారు.
ఇదీ చదవండి:
దిల్లీ గణతంత్ర వేడుకల్లో 'లేపాక్షి'కి చోటు.. అనంత జిల్లా ప్రజల్లో ఆనందం