AP JAC Chairman Bopparaju Fires on Government: ఏపీ ఐక్య కార్యచరణ సమితి(AP JAC) అమరావతి ఉద్యోగ సంఘం నాయకుల ఉద్యమం శాంతియుతం నుంచి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మూడవ దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్న ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు నేడు అనంతపురంలో భారీ సభ నిర్వహించారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అందరితో కలిసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కృష్ణ కళామందిర్లో రెండవ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు గత 60 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించ లేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇప్పటివరకు శాంతియుత ఉద్యమాన్ని మీరు చూశారని.. ఇకపై తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం ద్వారా.. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు, వాస్తవాల పట్ల ఉద్యోగుల్లో అవగాహన పెంచుతున్నామని.. బొప్పరాజు అన్నారు.
"గత నాలుగు సంవత్సరాల నుంచి పరిష్కారం నోచుకోని నేపథ్యంలో 66రోజులుగా శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈనెల 12 నుంచి 19వరకు 175 మంది ఎమ్మెల్యేలకు, 25మంది ఎంపీలకు ఉద్యోగుల ఆవేదన చెబుదాం అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే జిల్లాల్లో ప్రజాప్రతినిధులందరిని కూడా ఏపీజేఏసీ అమరావతి జిల్లా నాయకత్వం కలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం ద్వారా.. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు, వాస్తవాల పట్ల ఉద్యోగుల్లో అవగాహన పెంచుతున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకుంటే.. నాలుగో దశ ఉద్యమాన్ని చేపడతాం. అది చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది."- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు
ఈ ఉద్యమాన్ని ఉద్యోగులు ఆషామాషిగా తీసుకోవద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులకు ఇప్పటివరకు రావాల్సిన 4వేల కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత డీఏలు నాలుగు, కొత్త డీఏలు మూడు.. ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అలాగే పీఆర్సీ కూడా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చలకు పిలుస్తున్నప్పటికీ సరైన హామీ ఇవ్వడం లేదన్నారు. మరో వైపు ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. దీని ఉచ్చులో ఎవరు పడవద్దని సూచించారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటం చేసినప్పుడే సరైన ఫలితాలు సాధించుకోగలుగుతామని బొప్పరాజు స్పష్టం చేశారు. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకుంటే... నాలుగో దశ ఉద్యమాన్ని చేపడతామని బొప్పరాజు హెచ్చరించారు. అది చాలా తీవ్రంగా ఉంటుందని... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇవీ చదవండి: