APTF Protest: సీపీఎస్ రద్దు చేసేంత వరకు ఉద్యమాలు ఆపేది లేదని అనంతపురంలో ఏపీటీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఒకటి, రెండు, మూడు తరగతుల విలీనం ఆపాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు: నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వ విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.
ఏలూరు: ఏలూరులో ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పాత పింఛన్ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల శంఖారావం పేరిట చేపట్టిన ఆందోళనలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయనగరం: సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు విస్మరించారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రావు ఆరోపించారు. గద్దెనెక్కిన వారం రోజుల్లోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి మూడేళ్లు కావస్తున్నా దానిపై స్పందించక పోవడం విచారకరమన్నారు. రాష్ట్రప్రభుత్వం విధానాల కారణంగా ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్నా ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: దిల్లీలో అమరావతి రైతులు.. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై విజ్ఞప్తి