అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రంక్ పెట్టెల్లో బంగారు, వెండి, నగదు వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తండ్రి చనిపోగా ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా పొందిన మనోజ్ కుమార్... ఖజానా శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా పదమూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మనోజ్ కుమార్ అక్రమాస్తులు కూడబెట్టడం మొదలుపెట్టాడు. అక్రమ సంపాదనతో మనోజ్ విలాసవంతమైన జీవనం సాగించేవాడు. ఖరీదైన హార్లీడేవిడ్సన్ బైకుపై రైడింగ్ కు వెళ్లేవాడు. సొంతపొలంలో తనకు రెండు గుర్రాలు కూడా ఉన్నాయి. తాను కూడబెట్టిన అక్రమ సంపాదన మొత్తం ట్రంకుపెట్టెలో పెట్టి, సీలు వేసి తన వ్యక్తిగత డ్రైవర్ నాగలింగం ఇంట్లో దాచాడు మనోజ్ కుమార్. మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో నాగలింగం ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా..అసలు విషయం బయటపడింది.
తవ్వేకొద్దీ అక్రమాస్తులు
ఇంట్లో తుపాకులు ఉన్నాయనే సమాచారంతో మంగళవారం సాయంత్రం బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని నాగలింగం ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎస్సైలు, అనేకమంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. నిజంగా తుపాకులుగా భ్రమించే కొన్ని డమ్మీ తుపాకులు నాగలింగం వద్ద దొరికాయి.
ట్రంక్ పెట్టెల్లో
డ్రైవర్ నాగలింగం ఇంట్లో దొరికిన 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు గుర్తించారు. రూ.27 లక్షలు విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49 లక్షల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు దొరికాయి. హార్లీడేవిడ్ సన్ బైక్, 3 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు, రూ.లక్షల విలువైన మరో ద్విచక్రవాహనం 4 ట్రాక్టర్లు, 2 అత్యాధునిక కార్లు గుర్తించారు.
డ్రైవర్ నాగలింగం, అతని మావయ్య బాలప్పలతో సహా మనోజ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమ సంపాదనపై గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
రియల్ దందా చేశాడా?
ఖజానా ఉద్యోగి తన వద్ద ఎయిర్ పిస్టల్‌ను ఉంచుకోవడంతో రియల్ దందాలు చేశాడా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. డమ్మీ పిస్టల్ పట్టుకుని తగాదా ఉన్న భూములు కొనుగోలు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆయన పేరుతో నగరంలో చాలాచోట్ల ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అక్రమార్జనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. అశోక్‌నగర్‌లో సెంట్రల్ ఏసీతో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. బుక్కరాయసముద్రానికి వెళ్లే దారిలో చెరువుకట్ట వద్ద మరో నివాసం ఉన్నట్లు సమాచారం. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి విధులకు వస్తుంటాడు. ఆయన వెంట నిత్యం నలుగురు యువకులు అంగరక్షకుల్లా ఉంటారు
భార్యతో విభేదాలు
ఓ జాతీయ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న భార్యను, మనోజ్ శారీరకంగా హింసించేవాడని పోలీసులు తెలిపారు. అతనిపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయని చెప్పారు. నలుగురు యువకులను మనోజ్ వ్యక్తిగత అంగరక్షకులుగా నియమించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ కేసును ఆదాయపన్ను శాఖకు లేక అనిశాకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి : 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు