Blood Donation Camp in Marriage: పెళ్లంటేనే ఎంతో హడావుడి...ఎన్నో పనులు..వాటిని చూడటానికే సమయం సరిపోదని అంటుంటారు చాలా మంది. కానీ పెళ్లివేదికను సామాజిక సేవా వేదికగా మార్చేశాడా యువకుడు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనతో ముందడుగు వేసి అందరి మన్ననలూ పొందుతూ...తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు జబిఉల్లా. అతని చెల్లలు షేక్ అఖిల భానుకు వివాహం నిశ్చయం అయ్యింది.2022 ఫిబ్రవరి 6 న పెద్దలు మూహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పనులు మొదలు పెట్టారు. కానీ..సమాజానికి తన వంతు సేవ చేయాలి...అందుకు తన చెల్లి పెళ్లే వేదిక కావాలని భావించాడు జబి. సరికొత్త ఆలోచన తట్టింది. పెళ్లికి పిలవడానికి కావల్సినవి పెళ్లి పత్రికలు. తన ఆలోచనలకు అక్కడే అక్షర రూపం ఇచ్చాడు.
" మా చెల్లి పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి.. భోజన తాంబూలాదులు స్వీకరించ గలరని కోరారు. అంతేకాకుండా.. ఆశీస్సులతో పాటు రక్తదానం చేయాలని ఆహ్వాన పత్రికలో ప్రత్యేకంగా ప్రకటించారు. కొత్త జంటతో పాటు మనమంతా రక్తదానం చేద్దామని చైతన్యం నింపారు. పెళ్లికి వచ్చిన వారు గిఫ్ట్ లు ఇవ్వకుండా రక్తదానం చేయాలని పెళ్లి కార్డు ఇచ్చినప్పుడే చెప్పడం మరో విశేషం."
ఇదీ చదవండి : Pigeons Left in air : మరోసారి పావురాల ఎగురవేత కలకలం.. రంగంలోకి పోలీసులు
తన చెల్లి భాను వివాహ వేడుకల్లో బంధువులు, మిత్రులతో కలిసి ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు. అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్త సేకరణ చేపట్టారు. ఈ వివాహ వేడుకలకు రాయదుర్గం ఎమ్మెల్యే , రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వివాహ వేడుకల్లో కూడా సామాజిక సేవ చేయవచ్చనే జబిఉల్లా ఆలోచనకు, సహకరించిన అతని మిత్రబృందానికి ఎమ్మెల్యే దంపతులతో పాటు, గ్రామ ప్రజలు, బంధువులు, మిత్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
" జబీ తన చెల్లి పెళ్లిలో ఇలా రక్తదాన కార్యక్రమం చేయడం అభినందనీయం. యువత ఇలా మంచి పనులతో ముందుకు రావాలి. రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదాలు. " -కాపు భారతి, రాయదుర్గం ఎమ్మెల్యే సతీమణి, అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్ పర్సన్
"జబీ ఇలా వినూత్న ఆలోచనతో ముందుకు రావడం హర్షనీయం. పెళ్లి వేడుకను కూడా పది మంది ప్రాణాలు కాపాడటానికి ఉపయోగించడం నిజంగా గొప్ప ఆలోచన. ఇలాంటి వాళ్లని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రోత్సహిస్తుంది. వారకి మేము కూడా అండగా ఉంటాం. ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడగలుగుతాం. " -కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్.
ఇదీ చదవండి : Minister Perni Nani on State finance : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది: మంత్రి పేర్ని నాని
సమాజ సేవ కోసం జబిఉల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో "ఛేంజ్ ఫర్ సొసైటీ" అనే సంస్థను 18 నెలల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రెండుసార్లు రక్తదాన శిబిరాలు, ప్రభుత్వ వైద్యశాలలో, అనాథ ఆశ్రమాల్లో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి పలువురి చేత అభినందనలు అందుకున్నారు. జబి ఉల్లా తన బృంద సభ్యులతో కలిసి యువకులకు క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.తన సామాజిక సేవలో భాగంగా...తలసేమియా బాధితులు, చిన్నారులు, గర్భిణులు,రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారి కోసం రక్తం అందించాలనే ఉద్దేశంతో తన చెల్లి పెళ్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు జబీఉల్లా. గొప్ప మనసుతో అంతా రక్త దానం చేయాలని జబీ కోరారు. తనను ప్రోత్సహించి, సహకరించిన వారంరికీ ధన్యవాదాలు తెలిపారు.
"ఈ రోజు నా పెళ్లి సందర్భంగా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. " -షేక్ అఖిల భాను, పెళ్లికూతురు
"సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఛేంజ్ ఫర్ సొసైటీని ప్రారంభించాం. తక్కువ సమయంలోనే మాకు మంచి గుర్తింపు లభించింది. అందరిలా కాకుండా వినూత్నంగా చేయాలనే భావనతో మా చెల్లి పెళ్లిలో ఇలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకు సహకరించి, రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదాలు. సమాజ సేవే నా ధ్యేయం. " -జబీఉల్లా, పెళ్లి కూతురు అన్న, ఛేంజ్ ఫర్ సొసైటీ టీమ్ లీడర్
ఇదీ చదవండి : రెండు వర్గాల మధ్య పంచాయితీ.. ప్రార్థనా మందిరానికి తాళం..!