రైల్వేలో ఉద్యోగం, కియా కంపెనీలో ఉద్యోగం, హైవే రోడ్డు వైపు మొక్కలు నాటే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం కావాలన్న ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి...నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యక్తి.
అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన గరికపాటి సురేష్ అనే వ్యక్తి ఓ ఇంటర్నెట్ షాప్లో పని చేస్తుంటాడు. అమాయకమైన నిరుద్యోగులని ఎంచుకొని... వారికి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసంచేశాడు. లక్ష రూపాయలస్తే...నియామక పత్రాలు వెంటనే అందిస్తానంటూ వారిని నమ్మించాడు. అతని మాటలు నమ్మి సుమారు 17 మంది నిరుద్యోగులు ఏకంగా 18 లక్షలు ముట్ట చెప్పారు. తీరా నియామక పత్రాలు తీసుకుని సంబంధిత అధికారుల వద్దకు వెళ్లగా... అవి నకిలీ నియామక పత్రాలు అని తేల్చిచెప్పడంతో మోసపోయామని తెలుసుకున్నారు. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు కానీ...ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. మోసపోయామని మోరపెట్టుకున్నా పోలీసులు కనికరించలేదని వాపోయారు. నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ ఆ నిరుద్యోగ యువకులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు