Atchutapuram Gas Leakage Incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్లోని సీడ్స్ కంపెనీలో విషవాయువు బారినపడి అస్వస్థతకు గురైన కార్మికులను ఆదుకోవాలని తెదేపా జిల్లా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్రాండిక్స్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. బ్రాండిక్స్ సెజ్‌లో పని చేసే కార్మికుల బస్సులను అడ్డగించి ఆందోళన చేపట్టారు. నాయకుల పిలుపుతో.. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు బ్రాండిక్స్ వద్దకు తరలివచ్చారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కొన్ని బస్సులను వేరే మార్గంలో బ్రాండిక్స్ లోపలికి పంపారు. నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పీసీబీ చర్యలు: విషవాయువు లీకై సీడ్స్ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది అస్వస్థతకు గురైన విషయంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) చర్యలు తీసుకుంది. గ్యాస్ లీకైన పోరస్ కంపెనీలో కార్యకలాపాలు నిలుపుదల చేస్తూ పీసీబీ ఛైర్మన్ ఏకే ఫరీదా ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. కంపెనీలో విషవాయువు లీకవడం వల్ల 369 మంది అస్వస్థతకు గురయ్యారని పీసీబీ తెలిపింది. సాయంత్రంలోపు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నివేదిక వస్తుందని.. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఫరీదా వెల్లడించారు.
ఇదీ చదవండి: