Ramadevi who trained and became an owner: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధి కల్పన కోసం పలు రకాల శిక్షణలు ఇస్తుంటాయి. ఆ శిక్షణ కేంద్రాల్లో ఆటవిడుపు, ఆర్థిక సాయం కోసం నేర్చుకున్నవారే ఎక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మందే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధికి బాటలు వేసుకుంటారు. అలాంటివారిలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన నగిరెడ్డి రమాదేవి ఒకరని చెప్పవచ్చు. దుస్తుల తయారీలో కె.కోటపాడు శిక్షణాకేంద్రంలో శిక్షణ పొంది.. ఫ్యాషన్ టెక్నాలజీలో మెళుకువలు నేర్చుకుని ఏకంగా ఓ సంస్థకు అధిపతిగా నగిరెడ్డి రమాదేవి నిలబడ్డారు. ఆమె విజయగాథ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకుంటే.. మరికొందరికి స్పూర్తిదాయకమవుతుంది.
పని నేర్చుకున్నచోటనే యజమాని..: దుస్తుల తయారీపై ఆసక్తి.. ఆ రంగంలో రాణించాలన్న తపన ఆమెను పని నేర్చుకున్నచోటనే యజమానిగా నిలిపింది. తనకు శిక్షణ ఇచ్చిన డీఆర్‌డీఏతోనే ఎంవోయూ చేసుకుని 'డిజైర్ ఓవర్‌సీస్ సంస్థ' అనే పేరుతో ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్‌ను దాదాపు దశాబ్ద కాలంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధిని చూపిస్తూ నేటి మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఏడాది శిక్షణ జీవనానికి రక్షణ..: మహిళల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) దశాబ్దంన్నర క్రితం అన్ని జిల్లాల్లోను ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించింది. అందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో కె.కోటపాడు సెంటర్ ఒకటి. ఇందులోనే రమాదేవి 2012-13లో కుట్లు, దుస్తుల తయారీపై ఏడాదికిపైగా శిక్షణ తీసుకున్నారు. వివిధ రకాల మోడల్ దుస్తుల తయారీలో పట్టు సాధించారు.
మూతపడుతుంటే నిర్వహణకు సిద్ధమై..: రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్లన్ని నిర్వహణ లోపంతో ఒక్కోక్కటి మూతపడడం మొదలయ్యాయి. కొన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి మూతదశలో ఉన్న కె.కోటపాడు సెంటర్‌ను తాను నిర్వహిస్తానని ముందుకు వచ్చారు. డీఆర్‌డీఏతో నెలవారీ అద్దె చెల్లింపు ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నారు. 2014 నుంచి తానే ఈ ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్‌ను నడుపుతున్నారు.
మహిళలకు ఉపాధి కల్పిస్తూ..: 50 మందికి పైగా మహిళలకు నెలవారీ జీతాలిస్తూ ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ పదేళ్లలోనూ వందల మందికి కుట్టులో శిక్షణ ఇచ్చారు. కరోనా సమయంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మిగతా సెంటర్లు కూడా మూతపడ్డాయి. తాను మాత్రం ఆ క్లిష్ట పరిస్థితులను తట్టుకుని విజయవంతంగా నిలవగలిగారు.
ప్రముఖ దుస్తుల షోరూంల ఆర్డర్లు..: షర్టులు, ఫ్యాంట్‌లు, టాప్‌లు, లెగ్‌ఇన్, ప్లాజా, షార్ట్స్, ట్రాక్‌లు, నైటీలు ఇలా అన్నీ రకాల గార్మెంట్లను ఇక్కడ తయారు చేస్తుంటారు. కొన్ని ప్రముఖ దుస్తుల షోరూంలు తమకు కావాల్సిన డిజైన్ చూపించి సైజులు వారీగా కుట్టి అందించాలని నేరుగా సంప్రదిస్తుంటారు. కొన్ని కంపెనీలు, వస్త్ర దుకాణాలు నుంచి ఆన్‌లైన్‌లో బల్క్ ఆర్డర్లు తీసుకుంటారు. అలాగే భవాని, అయ్యప్ప మాలధారణ సమయాల్లో భారీగా ఆర్డర్లు వస్తుంటాయి.
ఏడాదిలో 365 రోజులు పని..: విశాఖలోని ఫార్మా పరిశ్రమలు, ప్రముఖ ఆసుపత్రులు, ఇతర కంపెనీల్లో పనిచేసే తమ సిబ్బందికి అవసరమైన వేల సంఖ్యలో యూనిఫామ్ లను ఇక్కడే కుట్టిస్తుంటాయి. ఇలా ఏడాదిలో 365 రోజులు ఇక్కడ మహిళలకు పనికల్పిస్తున్నారు రమాదేవి. కంపెనీల నుంచి ఆర్డర్లు లేని రోజుల్లో తామే స్వయంగా అన్ని రకాల మోడల్స్‌లో గార్మంట్ తయారు చేసి ప్యాక్టరీ అవుట్‌లెట్ పేరుతో రిటైల్ అమ్మకాలు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు.
గార్మెంట్ తయారీకి మంచి భవిష్యత్తు ..: ‘గతంలో సంవత్సరానికి ఒకటి, రెండుసార్లు పండగ రోజుల్లోనే బట్టలు కొనుక్కునేవారు. కొన్నాళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు కొత్త దుస్తులు ఉండాల్సిందే...కొనాల్సిందేగా మరి.. ఫలితంగా భవిష్యత్తు అంతా గార్మెంట్స్ తయారీదేనన్న భరోసా కలుగుతోంది.
భవిష్యత్తులో గార్మెంట్ తయారీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే మధ్యలో కొన్ని అవరోధాలు ఎదురైనా ఆశాభావంతో పనిచేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పది, ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలు వ్యవసాయం, మట్టి పనులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అలాంటి వారిలో గార్మంట్ తయారీపై ఆసక్తి చూపిన వారికి మా కేంద్రంలో నెలకు రూ.5 నుంచి రూ.6 వేలు స్టైఫండ్‌తో శిక్షణ ఇస్తున్నాం. ఒకప్పుడు నెలకు రూ.వెయ్యి స్టైఫండ్ తీసుకుని ఇక్కడ పని నేర్చుకున్నాను. ఈ రోజు నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలు జీతాలివ్వగలిగే స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉంది’ -రమాదేవి.
"డిజైర్ ఓవర్‌సీస్" పేరుతో దుస్తుల ప్యాక్టరీ..: 'భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని మరింత విస్తరించి మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలన్న ఆకాంక్షతోనే "డిజైర్ ఓవర్‌సీస్" అని మా దుస్తుల ప్యాక్టరీకి పేరుపెట్టాం' అని వివరించిన నగిరెడ్డి రమాదేవిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనపడింది. కుటుంబమే కాదు సమాజాభివృద్ధికి నగిరెడ్డి రమాదేవిలాంటి మరింత మంది మహిళలు నడుంబిగించాల్సిన ఆవశ్యకత, తోడ్పాటు ఎంతైనా అవసరముంది.
ఇవీ చదవండి