Bus yatra: పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేపట్టిన ‘బడి కోసం బస్సుయాత్ర’ను అనకాపల్లి జిల్లాలో పోలీసులు మంగళవారం అడ్డుకునేందుకు ప్రయత్నించారు. యాత్రకు అనుమతి లేదంటూ మునగపాక మండలం దోసూరుకు రెండు కి.మీ. దూరంలో వీరి బస్సును అచ్యుతాపురం పోలీసులు నిలిపేశారు. దీంతో రెండు కి.మీ.దూరం నడుస్తూ వెళ్లి దోసూరు ప్రాథమిక పాఠశాలకు ఎమ్మెల్సీలు సందర్శించారు.
పాఠశాల వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదమేర్పడింది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న దోసూరు ప్రాథమిక పాఠశాలను విలీనం చేయడం అన్యాయమని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులం కాకపోయినా బస్సుయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా పోలీసులను ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. యాత్రలో ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఎస్‌కే సాబ్జీ, వై.శ్రీనివాసరెడ్డి, స్థానిక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వద్దు: సీఎం