toxic gases: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ దుస్తుల కర్మాగారంలో తాజాగా జరిగిన విషవాయువుల లీకేజీ షెడ్ బయట జరిగిందని సంబంధిత శాఖలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. షెడ్‌లో వాయువులు లీకైతే అందరికీ ఆ ఘాటైన వాసన వచ్చేదని, అలా వచ్చినట్లు లోపల పనిచేసే కార్మికులు చెప్పలేదని పేర్కొన్నాయి. జూన్ 3 నాటి ఘటన షెడ్ లోపల జరిగిందని తేల్చాయి. సీడ్స్ పరిశ్రమలో తాజా ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదికను ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పీసీబీ, పరిశ్రమల శాఖల అధికారులు బుధవారం ప్రభుత్వానికి అందించారు. అందులోని ప్రధానాంశాల్ని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
- మంగళవారం సాయంత్రం 6.30-7.30 సమయంలో ఎం1 బ్లాక్ నుంచి క్యాంటీన్‌కు వెళ్లేచోట విషవాయువు లీకేజీ జరిగినట్లు గుర్తించాం. అందుకే బయటి ఉన్న కార్మికులపైనే గ్యాస్ ప్రభావం చూపింది. షెడ్ లోపల పనిచేసే కార్మికులు దాన్ని గుర్తించలేకపోయారు.
- జూన్‌లో జరిగిన దుర్ఘటన తర్వాత లోపలి గాలి బయటకు వెళ్లేమార్గాల్లో (ఎయిర్ వెంట్స్) సెన్సర్లను ఏర్పాటుచేశారు. ఏదైనా ప్రమాదకర వాయువులు విడుదలైతే వెంటనే అప్రమత్తం చేసేలా సెన్సర్లు పనిచేస్తాయి. మంగళవారం షెడ్ లోపల ప్రమాదకర రసాయనాలు విడుదలైనట్లు సెన్సర్లలో ఎక్కడా నమోదుకాలేదు.
- ఈ ప్రాంతంలో గాలి, బాధితుల రక్త నమూనాలు సేకరించి పరిశీలనకు పంపాం. ఆ నివేదిక వచ్చాకే ప్రమాదానికి కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నేడు ఉన్నతాధికారుల బృందం పరిశీలన: ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందనేది తేల్చేందుకు పరిశ్రమలు, పీసీబీ ఉన్నతాధికారులు గురువారం సీడ్స్ కర్మాగారం, పరిసర ప్రాంతాలను పరిశీలించనున్నారు.
దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భోపాల్‌లోని పర్యావరణ ఆరోగ్యసంస్థ (ఎన్విరాన్‌మెంట్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్) ప్రతినిధులతో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక అందిస్తుంది.
గ్యాస్ లీకేజీపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకేజీపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రమాద ఘటనపై అధికారులతో బుధవారం సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్యసహాయంపై ఆరా తీశారు. గ్యాస్ లీకేజీ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, కారణాలను వెలికితీసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి