Land grabbing Allegations on AP Minister Gudivada Amarnath: అనకాపల్లి జిల్లా మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు నియోజకవర్గాల్లో.. యథేచ్ఛగా భూఆక్రమణలు జరుగుతున్నాయి. కొండలను ఆనుకుని లేఅవుట్లు వేయడం, ఆ తర్వాత కొండలను పిండి చేసి రోడ్లు వేయడం.. గెడ్డలు, వాగులను పూడ్చేయడం.. చెరువులను చెరబట్టడం సర్వసాధారణమైంది. ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టినా సరే.. వాటిని పీకి పడేసి మరీ భూదందాలకు పాల్పడుతున్నారు. ఆక్రమణలపై విచారణ కోసం వేసిన కమిటీలు కూడా నివేదిక ఇచ్చేందుకు వెనకాడుతున్నాయంటే.. భూదోపిడీ వెనుక ఎవరున్నారో స్పష్టమవుతోంది.
పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం బయ్యవరంలో.. 600 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను లేఅవుట్‌కు అనువుగా చదును చేశారు. అందులో కొండల చుట్టూ 400 ఎకరాల్లో విల్లాలు నిర్మిస్తామని బ్రోచర్లు విడుదల చేశారు. లేఅవుట్ దారి కోసం 10 అడుగుల వెడల్పున్న చిన్నపాటి మార్గాన్ని.. 120 అడుగుల భారీ రహదారిగా మార్చారు. ఇందుకోసం పక్కనున్న అర్లికొండను తొలిచేశారు. మరోపక్కనున్న కొండవాలు గెడ్డను కప్పేశారు. ఆ పక్కనే దళితులకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను ఆక్రమించారు. మరికొందరి భూములకు రేటు కట్టి బలవంతంగా లాగేసుకున్నారు.
ఈ వ్యవహారం మొత్తం మంత్రి ప్రధాన అనుచరుడి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ భూబాగోతంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇదివరకే ఆర్డీవో విచారణ చేపట్టి, సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఆ మరుసటి రోజునే ఆ బోర్డులను ఆక్రమణదారులు పీకి పక్కన పడేశారు. వారిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అక్కడ ఎకరా కోటి వరకు పలుకుతోంది. ఆ లెక్కన 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి.
"అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండల పరిధిలో భారీ భూ కుంభకోణం అనకాపల్లి కేంద్రంగా జరుగుతోంది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని కూడా గుడివాడ అమర్నాథ్. మంత్రి ఆయన ప్రధాన అనుచరుడు వీరిద్దరు కలిసి చేస్తున్న వైనం. రికార్డులు తారుమారు చేస్తున్నారని మేము ఆరోపణలు చేస్తున్నాము. వాటికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి." -దూలం గోపి, జనసేన నేత, అనకాపల్లి జిల్లా
"పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పేదల తరఫున నిలబడుతానని ప్రకటించారు. గుడివాడ గుడివాడ అమర్నాథ్ భూ కుంభకోణం చేశారు. మరి దీనిలో ముఖ్యమంత్రి సమాన్యులకు న్యాయం ఎలా చేస్తున్నారని జనసేన తరఫున నిలదీస్తున్నాము." -తాడి రామకృష్ణ, జనసేన నేత, అనకాపల్లి జిల్లా
ఇటీవల జిల్లాకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. మంత్రి అమర్‌నాథ్ భూదందాలపై ఆరోపణలు చేశారు. ఐతే బయ్యవరం భూముల్లో ఒక సెంటైనా తన పేరిట ఉన్నట్లు నిరూపిస్తే రాసిచ్చేస్తామని మంత్రి సవాల్ చేశారు. తన అనుచరుల ప్రమేయం గురించి మాత్రం నోరు మెదపలేదు. మంత్రి ముఖ్య అనుచరుడే భూదందాలో ప్రధాన సూత్రధారి అని స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలలుగా భూ ఆక్రమణలపై న్యాయవిచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. లోకాయుక్త కూడా ఈ భూములపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినా.. రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు చూడటానికే ఇష్టపడటం లేదు.
ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి సొంత ఊరు దేవరాపల్లి మండలం తారువను ఆనుకునే భూఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కొండను ఆనుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి సుమారు 60 ఎకరాలు భూములు కొన్నారు. లేఅవుట్‌కు అనువుగా చదును చేశారు. దారి కోసం కొండపైనున్న గుడి పేరు చెప్పి.. ఎలాంటి అనుమతులూ లేకుండానే బాంబులు పెట్టి మరీ కొండవాలును పేల్చేశారు. ఆ తర్వాత 50 అడుగుల మేర రోడ్డు వేశారు.
స్థిరాస్తి వ్యాపారి కొన్న భూముల్లో మారేపల్లి రెవెన్యూ పరిధిలో దేవదాయశాఖకి చెందిన 23.15 ఎకరాల భూమి కూడా ఉంది. దీనిపై స్థానికులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దాసరి వెంకన్న అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేస్తేగానీ విచారణ చేపట్టలేదు. 6 నెలల క్రితం అనకాపల్లి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఆ భూములు తమ శాఖవేనని తేల్చారు. ఐతే ఆ స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ ముఖ్యనేతల ఆశీస్సులు ఉండటంతో.. భూములు వెనక్కి తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. కమిషనరేట్‌కు లేఖలు రాశామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడా భూముల్లో తోటలు పెంచుతూ ప్లాట్లను అమ్మకాలకు పెడుతున్నారు.
తారువ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 179లో రెడ్డివారి చెరువును స్థిరాస్తి వ్యాపారి కొంతమేర పూడ్చేసి లేఅవుట్‌లో కలిపేసుకున్నారు. పొక్లెయిన్లు పెట్టి చెరువు గట్టును తవ్వేశారు. 4.17 ఎకరాల చెరువు గర్భాన్ని ఆక్రమించుకున్నారు. చదును చేసిన భూముల్లో 182, 180/22, 184 సర్వే నంబర్లలో సుమారు 3.50 ఎకరాల ప్రభుత్వ భూములూ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టగా.. వాటిని తొలగించి కబ్జాలకు పాల్పడ్డారు. ఈ లేఅవుట్‌కు సమీపంలో ఉన్న రైతుల భూముల కోసం బలవంతపు బేరసారాలు నడుపుతున్నారు.
అధికారుల కళ్లెదుటే ఆక్రమణలు జరుగుతున్నా, ఫిర్యాదులు అందుతున్నా.. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అమాత్యుల కనుసన్నల్లోనే అనకాపల్లి జిల్లాలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న విపక్షాలు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.