Gas leak in Seeds: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లోని ‘సీడ్స్’ దుస్తుల కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మంగళవారం అదే కంపెనీలోని బి.షిఫ్టులో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. మరో మూడు గంటల్లో విధులు ముగుస్తాయనగా.. గాఢమైన విషవాయువు విడుదలై మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకేసారి పదుల సంఖ్యలో మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో కంపెనీలో ప్రాథమిక చికిత్స అందించారు. బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో అచ్యుతాపురం పీహెచ్‌సీకి తరలించారు. స్థానికంగా ఉన్న రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక మహిళా కార్మికులు నరకం అనుభవించారు. రాత్రి 7 గంటలకు ప్రమాదం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు చికిత్స అందించడానికి అచ్యుతాపురానికి ఒక్క వైద్యుడినీ పంపలేదు. గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ఊపిరందక మహిళా కార్మికులు ప్రాణభయంతో కేకలు వేశారు. వీరిలో ఊపిరి అందనివారిని అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి, వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అచ్యుతాపురంలో 40 మంది వరకు కార్మికులకు చికిత్స అందిస్తున్నారు. సీడ్స్ కంపెనీలో మరోసారి గ్యాస్ లీకైందని బ్రాండిక్స్ అపెరల్‌సిటీ పరిధిలో పనిచేసే ఇతర కార్మికులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదంపై అనకాపల్లి జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన నిపుణుల కమిటీ విచారించినా.. ఇంతవరకూ ప్రమాదానికి కారణాలు, విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో ఇంకా చెప్పలేదు.
జగన్‌రెడ్డి విశాఖను విషాదపట్నంగా మార్చేశారు...: లోకేశ్
ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విషాదపట్నంగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మంగళవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. రెండు నెలల వ్యవధిలోనే అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో రెండు సార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్కలేనితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయిన ఫర్వాలేదు...కమీషన్లు అందితే చాలన్నట్లు జగన్‌రెడ్డి పరిపాలన ఉందని మండిపడ్డారు. చనిపోయాక పరిహారమివ్వడం కాదు...వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉన్నతస్థాయి దర్యాప్తు చేయించాలి: సీపీఎం
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండు చేశారు. ‘యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది’ అని ఆరోపించారు.
ప్రభుత్వ పర్యవేక్షణ ఏమైంది: సోము వీర్రాజు
2 నెలల్లో రెండుసార్లు రసాయనాలు లీకయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా? అని ప్రశ్నించారు.
అదే ముప్పు.. పదేపదే!
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం: ప్రత్యేక ఆర్థిక మండలిలోని (సెజ్) కార్మికుల ప్రాణాలతో పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వం చెలగాటమాడుతున్నాయి. పదేపదే ఒకేతరహా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా వాటిని నివారించలేకపోతున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో రెండు నెలల్లోనే రెండు సార్లు విషవాయువు లీకై వందలమంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి ఘటనలపై విచారణలు జరిపిస్తున్నా కారణాలను వెల్లడించడంలేదు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సొంత జిల్లాలోని కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలు తీరు కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్ విషవాయువు లీకైన ఘటనలో 12 మంది చనిపోగా వేలమంది బాధితులయ్యారు. ఈ ఏడాది జూన్ 3న అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ అపెరల్ పార్కులో సీడ్స్ దుస్తుల తయారీ పరిశ్రమలో విషవాయువు లీకైంది. 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పలువురు ఉన్నతాధికారులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. వాయువు ఎక్కడినుంచి లీకైంది, బాధ్యులెవరో తెలుసుకోవడానికి కమిటీని నియమించి విచారణ చేపట్టారు. నివేదికలు కలెక్టరేట్‌కు అందినా.. ఇప్పటివరకూ బయటపెట్టలేదు. ఇప్పుడూ అదే తరహా ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం తీరును కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి.
ఇవీ చదవండి: PINGALI VENKAYYA: ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు.. రేపు విడుదల చేయనున్న సీఎం జగన్