BJP Yatra in Uttarandhra: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేని వైకాపా ఎమ్మెల్యేలు దద్దమ్మలని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం డబ్బులు ఇస్తే.. రాష్ట్ర సర్కారు సోకులు చేసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. ఈనెల 7న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భాజపా చేపట్టిన 'జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర'.. ఇవాళ రాత్రి అనకాపల్లి జిల్లా మాడుగులలో ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా మాడుగులలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గండి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సోము వీర్రాజు మాట్లాడారు.
అసంపూర్తిగా ఉన్న జలాశయాలు అభివృద్ధి చేస్తే కొన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్న ఆయన.. ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించే పట్టించుకోలేదని మండిపడ్డారు. 2024లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జల యాత్ర కన్వీనర్ పైడి వేణుగోపాల్, మహిళా నేత సంతోష్ సుబ్బలక్ష్మి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదంవడి: TDP Leaders: 'భాష మార్చుకోకపోతే.. ప్రజలే పీకేసే పరిస్థితి వస్తుంది'