CID NOTICES TO CHINTAKAYALA VIJAY: తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై మార్చి 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. నోటీసులు ఇచ్చేందుకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి CID పోలీసులు వెళ్లారు. అయితే ప్రస్తుతం విజయ్ ఇంట్లో లేరని సీఐడీ పోలీసులకు అయ్యన్న పాత్రుడు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి అభ్యంతరం లేదని.. ప్రస్తుతం విజయ్ అందుబాటులో లేనందు వల్ల రెండు రోజుల్లో విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని పోలీసులకు వివరించారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక.. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారని పార్టీ శ్రేణులు ఆరోపించారు.
ITDP leader Chintakayala Vijay: ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి పే పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అంశంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్‌ని సీఐడీ అధికారులు 2023 ఫిబ్రవరి 16న రెండోసారి విచారించారు. ఆరోజు ఉదయం 11గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 6 గంటల వరకూ నిర్విరామంగా సాగింది. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో 42 ప్రశ్నలతో సరిపెట్టారన్నారని విజయ్ తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పినట్లు విజయ్ తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో కూడా విచారణ జరుగుతోందని తెలిపారు. మొదటిసారి విచారణ సందర్భంలో చంద్రబాబు, లోకేశ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగారని అప్పుడు తాను అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. రెండోసారి కేవలం ఫిర్యాదు ఆధారంగా మాత్రమే ప్రశ్నించారని వెల్లడించారు. అయితే సీఐడీ అధికారులు నమోదు చేస్తున్న కేసుల్లో FIR బయటపెట్టకపోవటాన్ని విజయ్ తరపు న్యాయవాది తప్పుబట్టారు.
మొదటిసారి.. ఆరు గంటలు.. 68 ప్రశ్నలు: అంతకుముందు 2023 జనవరి 30న విజయ్ను సీఐడీ పోలీసులు మొదటిసారి విచారణ చేపట్టారు. గుంటూరు సీఐడీ ఆఫీసులో ఆరు గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో సీఐడీ అధికారులు మొత్తం 68 ప్రశ్నలు అడిగారని.. అన్నింటికి తాను సమాధానాలు చెప్పినట్లు అప్పట్లో విజయ్ వివరించారు.
అసలేం జరిగింది: వైఎస్ భారతి పే పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోకు సంబంధించిన చింతకాయల విజయ్‌పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు. 2022 అక్టోబర్ 01న హైదరాబాద్‌లో విజయ్ నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు అక్కడ హంగామా సృష్టించారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో చిన్న పిల్లలను, పనిమనిషిని ఆందోళనలకు గురిచేశారు.
ఇవీ చదవండి: