Students Problems in Tribal Hostel Without Basic Facilities: పేరుకే వసతి గృహం.. వాస్తవానికి కనీస సౌకర్యాలు లేని నిలయం.. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన సంక్షేమ పాఠశాలలో నెలకొన్న సమస్యల తాండవం ఇది.. ఏజెన్సీ వ్యాప్తంగా 115 ఆశ్రమ పాఠశాలలో ఉంటే అందులో 15 వరకు గిరిజన గురుకుల పాఠశాలున్నాయి. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు, కిటికీలు లేని వసతి గృహాలు బీటలు వారిన గోడలు, అపరిశుభ్రమైన పరిసరాలు దర్శనమిస్తాయి.
నీటి సదుపాయం కూడా అంతంత మాత్రమే అయినా నీటి నిల్వ చేసే ట్యాంకు పాచి పట్టింది అందులో ఉన్న నీటినే విద్యార్థులు స్నానానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉండటంతో చర్మ సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. చలికాలం కావడంతో వేడి నీళ్లు లేక చన్నీళ్లతో స్నానాలు చేయాల్సి వస్తోందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినే ఆహారం నాణ్యతగా లేకపోవటంతో తినీ తినక పస్తులుంటున్నాం అని చెబుతున్నారు.
కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్‌లో చేరుస్తామా- ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాలు అంటేనే సమస్యలు ఉంటాయనే విధంగా అధికారుల తీరు కనిపిస్తోంది. పాడేరులో తలార్ సింగి బాలురు పాఠశాలలో 500 మందికు పైగా ఉన్న విద్యార్థులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నా.. అధికారులకు మాత్రం ఇవేవి కనిపించకపోవడం దురదృష్టకరం.. పిల్లలు ఉండటానికి గదుల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం ఇటీవల నిర్మించిన కొత్త వసతి గృహాన్ని కళాశాల విద్యార్థులకు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని అంటున్నారు.
తాము ఉంటున్న వసతి గృహాలకు మైయిన్ గేటు లేకపోవటంతో పశువులు, పందులు లోపలకి వస్తున్నాయంటున్నారు. తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని విద్యార్థులు వారి గోడును వెల్లబుచ్చుతున్నారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు అయినా అధికార పాలక వర్గాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Girls Problems in Tribal Hostel Due to Lack of Facilities: Students గిరిజన సంక్షేమ ఇంగ్లిష్ మీడియం పాడేరు పాఠశాలలో విద్యార్థినిలు తరగతి గదిలోనే డార్మెటరీ ఉండడంతో ఇక్కట్లు పడుతున్నారు. చలి మంటలు వేసుకోలేక, సరిపడా దుప్పట్లు లేక, గుంపులు గుంపులుగా కూర్చుని చలికి ఉపశమనం పొందుతున్నారు. మెనూ పరిశీలించగా శుక్రవారం పొంగలి శెనగ చెట్నీ గుడ్డు ఇవ్వవలసి ఉంది.. అయితే పొంగలి మాత్రమే సిద్ధం చేశారు.. వర్కర్‌ను ప్రశ్నించగా తమకు గుడ్లు ఇవ్వలేదని చెప్పారు. పిల్లల్ని ప్రశ్నించగా గుడ్లు ఎప్పుడు పెట్టారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
పాడేరు ఏపీఆర్లో నిర్వహిస్తున్న ఏకలవ్య పాఠశాలలో మూడు మండలాలకు చెందిన విద్యార్థులు ఒకే చోట ఉన్నారు. అదే డార్మెటరీ.. అదే తరగతి గది.. అక్కడే పుస్తకాలు, అక్కడే బకెట్లుతో నిండిపోయింది. నీళ్లు లేక తెల్లవారుజాము మూడు గంటల నుంచి మెస్ నుంచి మోసుకొస్తూ 300 మంది పైబడి విద్యార్థినులు.. ఇక్కట్లు గురవుతున్నారు. సరైన సెక్యూరిటీ లేక భయభ్రాంతులకు గురవుతున్నామని.. నీటి సదుపాయం, బాత్రూం సదుపాయం సరిగా లేదని ఆవేదన చెందారు. పశువుల సైతం లోనికి వచ్చి ఆరబెట్టిన బట్టలు పాడు చేస్తున్నాయన్నారు. అధికారులు తమకు త్వరితగతిన ఏకలవ్య పాఠశాల నిర్మించి వసతి కల్పించాలని విద్యార్థినిలు కోరుతున్నారు.