రాష్ట్రంలో విజయవాడ తరువాత సాలూరు లారీ పరిశ్రమది రెండోస్థానం. ఈ పరిశ్రమలో సుమారు 2 వేల లారీలు ఉండగా.. 15వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, లారీ బాడీబిల్డింగ్, పెయింటింగ్, టైర్లు, గ్యారేజీలు, మెకానిక్, విడిభాగాల విక్రయదారులు, గ్యాస్ వెల్డర్లు, కార్పెంటర్లు, సీట్ల తయారీదారులు, స్టిక్కరింగ్ తదితర పనులు చేసేవారు ఉన్నారు. ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరుకు ఎగుమతి, దిగుమతులు పెద్ద ఎత్తున జరుగుతాయి. సాలూరు లారీ పరిశ్రమకు అనుబంధంగా పలు చిన్నతరహా పరిశ్రమలు నెలకొన్నాయి. ఇటువంటి పరిశ్రమను కొవిడ్ మహమ్మారి కుదిపేయటంతో.. నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లారీ పరిశ్రమను.. వేళాపాళా లేని కరెంటు కోతలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. విద్యుత్ సరఫరా ఉంటే తప్ప పనులు సాగవని.. దీంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులో కుటుంబపోషణ భారంగా మారిందని వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న రకరకాల పన్నులు మరింత భారంగా మారాయని.. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాధవరావు అన్నారు. నష్టాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సహకరించకపోగా.. మరింత ఇబ్బందికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కరోనా తర్వాత లారీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. రూ.200 ఉన్న గ్రీన్ టాక్స్ ను రూ.20వేలు చేశారు. 18గంటల కరెంటు కోతతో ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు." -మాధవరావు, రాష్ట్ర కార్యదర్శి, లారీ ఓనర్స్ అసోసియేషన్
కోతలు లేకుండా కరెంటు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి : Electricity: విద్యుత్తు లేదా.. కొనడానికి డబ్బుల్లేవా?