పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఉన్న ఊరిని, నమ్ముకున్న భూమిని వదిలేసి వచ్చిన నిర్వాసితులకు... పరిహారం అందించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిర్వాసిత కుటుంబాల్లోని యువతకు ఉపాధిలేక తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితుల జాబితాలో చేర్చకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. నిర్దేశించిన గడువులోగా 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా... ఇప్పటికీ అర్హుల జాబితాలో చేర్చడం లేదని అంటున్నారు. అధికారులు తప్పుడు సర్వేలు నిర్వహించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అర్హుల జాబితాలో ఉన్నా పరిహారం ఇవ్వకపోగా.... బతికున్న వారిని కూడా మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుతో ప్రభావితమవుతున్న నిర్వాసితుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం లక్షా 6వేల 6మందిగా నిర్ధారించింది. అయితే ఇప్పటివరకు కేవలం 7వేల 962 మంది మాత్రమే తరలించింది. మొత్తం లక్షా 67వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా... ఇప్పటి వరకు లక్షా 13వేల ఎకరాలను సమీకరించింది. నిర్వాసితుల మౌలిక సదుపాయల కోసం 13వేల 262 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు వెచ్చించింది వెయ్యి 43 కోట్లు మాత్రమే. నిర్వాసితులకు 8వేల112 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 877 కోట్లు మాత్రమే ఇచ్చింది. నీటి నిల్వకు అనుగుణంగా దశలవారీగా నిర్వాసితుల తరలింపు చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. తొలిదశలో 20 వేల 946 మందిని తరలించాల్సి ఉన్నా ఇప్పటికి తరలించింది 7వేల 962 మందిని మాత్రమే. పైగా అర్హుల గుర్తింపు ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా ఉందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నిర్వాసితుల జాబితా రూపొందించినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న వారందరూ... ఇప్పుడు పెరిగి పెద్దవాళ్లయ్యారు. చాలామందిక పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇప్పుడు వారందరూ ప్రభుత్వం ఇచ్చే చిన్న ఇంటిలో ఉండలేక సతమతమవుతున్నారు. ఎక్కడో ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో నిర్వాసిత గ్రామాలు నిర్మించడంతో ఉపాధి అవకాశాలు కూడా దొరకడం లేదు. 2017 - 18 ధరల ప్రకారం ప్రాజెక్టులో నిర్వాసితలకు 33వేల 168.23 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర జలసంఘం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంచనా వేసింది. ఇప్పటి వరకూ భూసేకరణపై 3వేల 771 కోట్ల రూపాయలు, పునరావాస- పరిహారం కోసం 19వందల 18 కోట్లను మాత్రమే ప్రభుత్వం వ్యయం చేసింది.
ఇదీ చదవండి: