One Crore Worth Ganja Seized in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు పోలీసులు కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో సీలేరు పంచాయతీకు చెందిన వార్డు వాలంటీర్ సైతం ఒకరు ఉన్నారు.
దీనికి సంబంధించి చింతపల్లి అదనపు ఎస్పీ కేపీఎస్ కిశోర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీకేవీధి సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో.. సీలేరు ఎస్సై జె. రామకృష్ణ వాహనాలను టీఆర్సీ క్యాంపు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, ఏపీ 20ఎఎ 9737 నెంబరు గల కారును ఆపి తనిఖీ చేయగా.. ఆ కారులో ప్యాకింగ్ చేసిన గంజాయి బయటపడింది.
ఆదాయం సరిపోవడం లేదని..: దీంతో పోలీసులు కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం సరిపోక, చెడు అలవాట్లకు లోనై, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. సీలేరు పంచాయతీలో వార్డ్ వాలంటీర్‌గా పని చేస్తున్న కొర్రా జగ్గారావు, కొర్రా దారబాబు, సీసా లైకోన్, కిల్లో రాజు, వంతల త్రినాథ్, వెంకటేష్‌లు ఒక గ్రూప్‌గా ఏర్పడి ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి బయట ప్రాంతాలు నుంచి వచ్చే వారికి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
భద్రాచలం తరలిస్తుండగా: ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన సికిందర్ అలియాస్ సూరజ్‌ను సంప్రదించారు. తనకు 350 కేజీల గంజాయి కావాలని అడగడంతో చింతపల్లి క్యాంపుకు చెందిన ఈ బృందం ఒడిశాలోని కెందుగూడా, పసుపులంక ప్రాంతాల్లో 353 కేజీల గంజాయిని కొనుగోలు చేసి లైకన్పూర్ గ్రామానికి తీసుకువచ్చి 12 సంచుల్లో ప్యాకింగ్ చేసి టొయోటా కారులో లోడ్ చేసి గంజాయిని భద్రాచలంలోని సికిందర్ అలియాస్ సూరజ్‌కు విక్రయించడానికి వెళ్తుండగా టీఆర్సీ క్యాంపు వద్ద పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డారు.
మరో ఇద్దరు పరారీలో: నిందితుల నుంచి 353 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లు, మూడు వేల రూపాయల నగదు, ఒక కారును సీజ్ చేశామని.. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని, ఈ కేసుతో సంబంధమున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అదనపు ఎస్పీ కేపీఎస్ కిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ అశోక్ కుమార్, ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సీఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్సై జె. రామకృష్ణ, కానిస్టేబుళ్లును.. అదనపు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.
Ganja Smuggling in Alluri District: అల్లూరి జిల్లాలో గంజాయి రవాణా రవాణా గత కొంత కాలంగా పెరుగుతోంది. కొద్ది రోజులగా ఎక్కువగా ఇదే జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నప్పుటికీ గంజాయి స్మగ్లర్లు తగ్గడం లేదు. అదే విధంగా పోలీసుల సైతం తనిఖీలు చేపట్టి.. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.
Ganja Seized in Chinatapalli: అల్లూరి జిల్లాలో రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్