MAOIST LEADER PANDANNA : అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం కొమ్ములవాడలో మావోయిస్టు అగ్రనాయకుడు కాకూరి పండన్న అలియాస్ జగన్ తల్లి సీతమ్మ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. వృద్యాప్యంతో వచ్చిన వ్యాధులతో ఆమె కొన్నాళ్లుగా బాధపడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సీలేరు పోలీసులు ఆధ్వర్యంలో మావోయిస్టు నేత తల్లి సీతమ్మకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు మందులు అందజేశారు. ఇంతలోనే బుధవారం అకస్మికంగా అస్వస్థతకు గురై గురువారం తెల్లవారు జామున మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి వారి రక్త సంబంధికులు ఎవ్వరూ లేరు. ఎవరైనా వచ్చి ఆర్థిక సహాయం చేసి అంత్యక్రియలు నిర్వహించాలని సీతమ్మ కోడలు సీతమ్మ కోరింది.
శ్మశానం వరకు పాడె మోసిన ఎస్ఐ.. : మావోయిస్టు అగ్రనాయకుడు కాకూరి పండన్న అలియాస్ జగన్ తల్లి సీతమ్మకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. సీలేరు ఎస్ఐ రామకృష్ణ స్వయంగా పాడె మోసి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున అనారోగ్యంతో కాకూరి సీతమ్మ మృతి చెందిన విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న సీలేరు ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో దుప్పివాడ పంచాయతీ మారుమూల గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కొమ్ములవాడ చేరుకున్నారు.
కాకూరి సీతమ్మ మృతి చెందడంపై గ్రామస్థులను, బందువులను వివరాలు అడిగి ఎస్ఐ తెలుసుకున్నారు. కాకూరి సీతమ్మ కోడలు సీతమ్మ, వారి బందువులతో మాట్లాడారు. ఎస్ఐ రామకృష్ణ మృతురాలు సీతమ్మకు వస్త్రాలు తీసుకువచ్చి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. ఎస్ఐ రామకృష్ణ స్వయంగా శ్మశానం వరకు పాడె మోసారు. అనంతరం కర్మ చేయడానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీతమ్మ కోడలుకు అందజేశారు.
మావోయిస్టు తల్లికి వైద్య పరీక్షలు : గత నెలలో అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు పోలీసులు వైద్య పరీక్షల నిర్వహించారు. వైద్య సేవలు అందించారు. కొద్ది రోజులు ఆరోగ్యం బాగుంది. తరువాత ఆమె అనారోగ్యం క్షీణించ సాగింది. గురువారం ఉదయం సీతమ్మ మృతి చెందింది. ఈ సందర్బంగా మృతురాలు సీతమ్మ కోడలు సీతమ్మ మాట్లాడుతూ సీతమ్మకు ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు మృతి చెందగా, మరొక కుమారుడు అడవి బాట పట్టారని, తన జీవితమంతా అడవి బాట పట్టిన మావోయిస్టు కాకూరి పండన్నను జనజీవనంలోకి వచ్చి వృద్ధాప్యంలో తనకు సేవలందించాలని కోరిందని, ఆమె మృతి చెందిందని.. సీతమ్మ కోరిక నెరవేరలేదని, ఇప్పటికైనా పండన్న ఉద్యమం నుంచి బయటకు వచ్చి తన తల్లి కోరిక నెరవేర్చాలని ఆమె కోరింది.
ఇవీ చదవండి