Godavari floods:అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం గోకవరపుడ గ్రామంలో వరద బాధితులు నిరసన చేపట్టారు. జూలై నెలలో వచ్చిన గోదావరి వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ వరదల వల్ల 15 రోజులపాటు వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు మరోసారి వరదల కారణంగా ముంపునకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. తమకు 2వేల రూపాయల సహాయం అందించారని బాధితులు తెలిపారు. కూలిపోయిన ఇళ్లకు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదని నిరసన చేపట్టారు. బాధితులు మోకాళ్ల లోతు నీటిలో దిగి నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఇస్తున్న బియ్యం, ఉప్పులాంటివి కాకుండా.. పరిహారం అందించాలని కోరారు. తమ పరిహారం తమకు ఇస్తే తమ బతుకు తాము బతుకుతామని ఆవేదన వ్యక్తం చేశారు.